Share News

Medigadda project: మేడిగడ్డ కేసు డిసెంబరు 27కు వాయిదా

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:32 AM

మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మరో ఆరుగురిపై భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన కేసు మళ్లీ వాయిదా పడింది.

Medigadda project: మేడిగడ్డ కేసు డిసెంబరు 27కు వాయిదా

  • కేసీఆర్‌ సహా ఏడుగురు గైర్హాజరుతో కోర్టు నిర్ణయం

భూపాలపల్లి కృష్ణకాలనీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మరో ఆరుగురిపై భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన కేసు మళ్లీ వాయిదా పడింది. ప్రతివాదులైన కేసీఆర్‌, హరీశ్‌రావు, ఇరిగేషన్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, రాష్ట్ర మాజీ ముఖ్య అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్లు హరిరాం, ఎన్‌.శ్రీధర్‌, మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, ఎల్‌అండ్‌టీ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ సురేశ్‌ కుమార్‌ భూపాలపల్లి జిల్లా సేషన్‌ కోర్టుకు గురువారం హాజరుకావాల్సి ఉంది.


హరీశ్‌రావు తరఫున న్యాయవాది లలితారెడ్డి, మెగా కృష్ణారెడ్డి, రజత్‌కుమార్‌ తరఫున న్యాయవాది అవధాని, హరిరాం, శ్రీధర్‌ తరఫున న్యాయవాది నర్సింహరెడ్డి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. దీంతో కేసును డిసెంబరు 27కు జడ్జి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌, స్మితా సబర్వాల్‌, ఎల్‌అండ్‌టీ సురేశ్‌ కుమార్‌కు సమన్లు పంపనున్నట్టు పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. తమ తరఫు న్యాయవాది గంట సంజీవ రెడ్డి మృతి చెందడంతో ఆయన స్థానంలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌తో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను నియమించుకున్నామని పిటిషనర్‌ తెలిపారు.

Updated Date - Oct 18 , 2024 | 03:32 AM