Hyderabad: అల్లు అర్జున్‌పై కేసు
ABN , Publish Date - Dec 06 , 2024 | 03:19 AM
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో.. సినీ నటుడు అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆయన భద్రతాసిబ్బందితోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపైనా!
మహిళ మృతి నేపథ్యంలో..
బీఎన్‌ఎస్‌లోని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు
అల్లు అర్జున్ వస్తున్నట్టు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు: పోలీసులు
నేరం రుజువైతే పదేళ్లదాకా జైలు!
చిక్కడపల్లి/కవాడిగూడ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో.. సినీ నటుడు అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బందిపైనా భారత న్యాయ సంహితలోని సెక్షన్ 105 (హత్య కిందకు రాని ప్రాణనష్టం కేసుల్లో పెట్టే సెక్షన్), 118(1) (ప్రమాదకరంగా వ్యవహరించడం ద్వారా వేరే వ్యక్తులు గాయపడేందుకు కారణం కావడం) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్ష్ యాదవ్ తెలిపారు. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది (గతంలో సల్మాన్‌ఖాన్‌పై పెట్టిన ఐపీసీ 304 సెక్షన్ బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 105తో సమానం). ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి(39) అనే మహిళ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ తొక్కిసలాటలో మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
దాంతో పోలీస్ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. గురువారం సాయంత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ప్రీమియర్ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ వస్తున్నట్లు సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని.. హీరో థియేటర్‌లోకి ప్రవేశించడానికి అనువుగా ఉండేలా ప్రత్యేక ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయలేదని డీసీపీ తెలిపారు. అభిమానులను నియంత్రించే ఏర్పాట్లుగానీ.. ముందస్తుగా ప్రత్యేక భద్రతా చర్యలుగానీ తీసుకోలేదని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు భద్రతా సిబ్బందితో థియేటర్ వద్దకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా థియేటర్‌లోకి వెళ్లకుండా సమీపంలోని క్రిస్టల్ హోటల్ నుంచి ఓపెన్ టాప్ కారులో అభివాదం చేసుకుంటూ లోపలికి వచ్చారని.. ఆయన్ను చూడటానికి, సెల్ఫీలు దిగడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడటం, వందలాది మంది ఒక్కసారిగా చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగినట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో మరణించిన రేవతి భర్త భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా.. రేవతి మృతదేహానికి గురువారం సాయంత్రం పోస్ట్‌మార్టం పూర్తయ్యిందని చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ తెలిపారు. మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించామని వివరించారు.
పోలీసుల వైఫల్యంపై విమర్శలు
హీరో రాకపై తమకు ముందస్తు సమాచారం లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ.. తాము సమాచారం ఇచ్చామని థియేటర్ సిబ్బంది చెబుతున్నట్టు సమాచారం. పుష్ప మొదటి భాగం విడుదల సమయంలో కూడా అల్లు అర్జున్ ఇలాగే ఓపెన్ టాప్ కారులో అందరికీ అభివాదం చేస్తూ థియేటర్‌కు వచ్చారని.. ఆ విషయం తెలిసీ పోలీసులు ఈసారి కనీస జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. రేవతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం, తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడికి ఉచిత వైద్యం, విద్య అందించాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టును ఆశ్రయించిన జర్నలిస్ట్ సతీశ్ కమాల్ డిమాండ్ చేశారు. ఇక.. సంధ్య థియేటర్‌లో వేసింది బెనిఫిట్ షో కాదని, అది ప్రాఫిట్ షో అని.. హైకోర్టు సీనియర్ న్యాయవాది పి.శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషమంగానే శ్రీతేజ్ పరిస్థితి
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌కు కిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రికి తీసుకువచ్చేసరికి శ్రీతేజ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని.. దీంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. బాలుడి మెదడు, వెన్ను భాగాలకు సీటీ స్కాన్ చేశామని, అవి సాధారణ స్థితిలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
కొద్దిసేపట్లో లోపలికివెళ్లేవారే
మా అన్నయ్య కుమారుడు శ్రీతేజ్.. అల్లు అర్జున్‌కు వీరాభిమాని. ఇరవై రోజులుగా ‘పుష్ప 2’ సినిమా చూడాలని అడుగుతున్నాడు. దీంతో ప్రీమియర్ షోకు టిక్కెట్లు బుక్ చేసి తెచ్చుకున్నారు. బుధవారం రాత్రి 9.15 గంటలకు థియేటర్‌కు చేరుకున్నారు. మరో ఐదు నిముషాల్లో టిక్కెట్లు ఇచ్చి థియేటర్‌లోకి ప్రవేశించేవారే. కానీ.. అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడని తెలియగానే థియేటర్ లోపల ఉన్నవారు బయటకు రావడానికి యత్నించారు. ఆ తొక్కిసలాటలో వదిన మృతి చెందింది. శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. 72 గంటల తర్వాతే ఏదైనా చెబుతామని డాక్టర్లు చెబుతున్నారు.
- సంతోష్ (భాస్కర్ సోదరుడు)