Share News

AI Startups: ఏఐ స్టార్టప్‌లకు రూ.2 వేల కోట్లు

ABN , Publish Date - Sep 06 , 2024 | 03:55 AM

కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయించిందని కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అభిషేక్‌ సింగ్‌ అన్నారు.

AI Startups: ఏఐ స్టార్టప్‌లకు రూ.2 వేల కోట్లు

  • ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తాం

  • ఏఐ రంగంలో తెలంగాణది అగ్రస్థానం

  • ‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర ఐటీశాఖ

  • అదనపు కార్యదర్శి అభిషేక్‌ సింగ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయించిందని కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అభిషేక్‌ సింగ్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో అనేక ఆవిష్కరణలు వచ్చాయని గుర్తుచేశారు. ఆవిష్కరణల్లో ప్రపంచంతో పోటీపడేలా ఇక్కడి యువతను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తున్న ఇంటర్నేషనల్‌ ఏఐ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన అభిషేక్‌ సింగ్‌.. భవిష్యత్‌లో రాబోయే ఏఐ విప్లవంపై ప్రసంగించారు.


ఈ సందర్భంగా తన అభిప్రాయాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కృత్రిమ మేధ రంగంలో దేశం వెనకబడకూడదన్న లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఏఐ మిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి వచ్చే ఐదేళ్లకు గాను రూ.10వేలకు కోట్లకు పైగా మంజూరుచేసింది. దేశం, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఏఐ సాంకేతికతతో స్టార్టప్‌లు పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ఆ దిశగా పనిచేసే స్టార్టప్‌లను గుర్తించేందుకు హాకథాన్‌ నిర్వహించాం.


  • వైద్య రంగంలో..

రోగాలను ముందస్తుగా గుర్తించడమే అత్యంత కీలకం. ఆ దిశగా ఏఐ టెక్నాలజీతో ఇప్పటికే అనేక ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌ లాంటి తీవ్రమైన సమస్యలను ముందస్తుగా గుర్తించే టెక్నాలజీ ఏఐ ద్వారా అందుబాటులో ఉంది. ఇతర అనారోగ్య సమస్యలనూ ఏఐ కచ్చితత్వంతో గుర్తిస్తోంది. దేశ వైద్య రంగంలో ఇది కీలకమైన పరిణామం.


  • సమాచార గోప్యతే కీలకం..

ఏఐతో లాభాలతోపాటు నష్టాలూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత సమాచార భద్రత అత్యంత కీలకం. ఏఐ పరిశోధకులు ఈ విషయంపై ప్రత్యేకంగా దృస్టి సారిస్తున్నారు. ఏఐతో డీప్‌ఫేక్‌ను అడ్డుకోవడం కూడా ఇప్పుడు పెద్ద సమస్య. తప్పుడు సమాచార వ్యాప్తిలోనూ ఏఐని విపరీతంగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. దీనిపైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.


  • ఏఐ సదస్సు నిర్వహణ భేష్‌..

ఐటీ రంగంలో హైదరాబాద్‌ ఎప్పటినుంచో ముందంజలో ఉంది. ఏఐ రంగంలోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ ఏఐ సదస్సును గొప్పగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుతో ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం పేరు మార్మోగనుంది. కేంద్రం అమలుచేస్తున్న ఏఐ మిషన్‌లో భాగంగా తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధం. ఈ రంగంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధిస్తుంది.

Updated Date - Sep 06 , 2024 | 03:55 AM