Share News

Smart City: జహీరాబాద్‌ వాసుల హర్షం..

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:25 AM

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వరాన్ని ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ‘ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ’ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

Smart City: జహీరాబాద్‌ వాసుల హర్షం..

  • 3,245 ఎకరాల్లో స్మార్ట్‌సిటీ నిర్మాణం

  • రూ.2,361 కోట్ల అంచనా వ్యయం

  • 1.74 లక్షల మందికి ఉపాధి

  • ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

  • రూ.10 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

  • నిమ్జ్‌ ప్రతిపాదిత గ్రామాల్లోనే స్మార్ట్‌సిటీ

  • కేంద్రం ప్రకటనపై స్థానికుల హర్షం

  • ఏపీలో ఓర్వకల్లు, కొప్పర్తి స్మార్ట్‌ సిటీలు

హైదరాబాద్‌/జహీరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వరాన్ని ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ‘ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ’ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. బుధవారం కేంద్ర క్యాబినెట్‌ 10 రాష్ట్రాల్లో ఆమోదించిన 12 స్మార్ట్‌ సిటీలలో ఇది ఒకటి. ‘స్వర్ణ చతుర్భుజి’లో భాగంగా ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంగా ఏర్పాటు కానున్న ఈ స్మార్ట్‌ సిటీతో.. 1.74 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.10వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా. కొత్త పారిశ్రామిక స్మార్ట్‌ సిటీలను మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.


జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీ.. గతంలో యూపీఏ-2 సర్కారు ప్రకటించిన జాతీయ పెట్టుబడుల, ఉత్పాదక జోన్‌(నిమ్జ్‌) ప్రతిపాదిత గ్రామాల్లోనే ఏర్పాటు కానుంది. అంటే.. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లోని 17 గ్రామాల్లో.. 7,045 మంది రైతుల నుంచి ఇది వరకే సేకరించాలని నిర్ణయించిన 12,635 ఎకరాల్లోనే స్మార్ట్‌ సిటీ అభివృద్ధి చెందనుంది. ఇప్పటి వరకు ఝరాసంగం మండలంలోని బర్దీపూర్‌, చీలపల్లి, రుక్మాపూర్‌, ముంగి, ఎల్గోయి గ్రామాల్లో 3,500 ఎకరాల భూసేకరణ పూర్తయింది. రెండో విడతలో భాగంగా 12 గ్రామాల్లో భూసేకరణ ప్రారంభమైంది.


ఇక్కడ రూ.100కోట్ల వ్యయంతో ఇప్పటికే 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ రోడ్డు నిర్మాణానికి జహీరాబాద్‌, ఝరాసంగం మండలాల్లోని 229మంది రైతుల నుంచి 65 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. హుగ్గెల్లి నుంచి నిమ్జ్‌ వరకు ఓ వైపు బీటీరోడ్డు పూర్తయింది. 100 అడుగుల రోడ్డు కూడా త్వరలో పూర్తికానుంది. పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్‌సిటీ 3,245ఎకరాల్లో రానుంది. దీనికి రూ.2,361కోట్లను కేటాయించాలని కేంద్ర క్యాబినెట్‌ బుధవారం నిర్ణయించింది.


  • మూడేళ్లలో పూర్తి!

ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ సిటీ అందుబాటులోకి వస్తే.. ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఆహార శుద్ధి యంత్రాలు, ఖనిజ/ఖనిజేతర లోహాల ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి. 1.74 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగడమే కాకుండా.. రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా. ఇప్పటికే నిమ్జ్‌ ప్రతిపాదిత స్థలంలో హ్యుందాయ్‌, వెమ్‌టెక్నాలజీ సంస్థలు కర్మాగారాలను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి.


మాజీ మంత్రి గీతారెడ్డి కృషితో ఈ ప్రాంతానికి నిమ్జ్‌ రాగా.. సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌షెట్కార్‌ చొరవతో జహీరాబాద్‌ ఓ గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. జహీరాబాద్‌ స్మార్ట్‌సిటీ తెలంగాణకు మణిహారంగా మారనుంది. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌లో ఈ స్మార్ట్‌సిటీ అత్యంత కీలకం కానుంది. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఉండడం.. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాంతం ఉత్పాదకతతో పాటు.. సరకు రవాణాలో కీలకంగా మారనుంది. జహీరాబాద్‌, మెటల్‌కుంట రైల్వేస్టేషన్లు కూడా స్మార్ట్‌సిటీకి కలిసి వచ్చే అంశం. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకూడా వస్తే.. ఇక్కడి నుంచి రవాణా మరింత సులభమవుతుంది.


  • రాష్ట్ర ప్రభుత్వం వద్దే 80% భూమి.. వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి దిశగా కేంద్రం మరో మెగా ప్రాజెక్టును కేటాయించిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్‌లో పారిశ్రామిక స్మార్ట్‌ నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంపై ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పీయూ్‌షగోయల్‌కు బుధవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి కార్యక్రమం(ఎన్‌ఐసీడీపీ)లో భాగంగా తెలంగాణలోని జహీరాబాద్‌లో పారిశ్రామిక స్మార్ట్‌ నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.


ఈ ప్రాజెక్టుతో తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి మరింత వేగంగా ముందడుగు పడుతుందన్నారు. ‘‘తొలి దశలో 3,245 ఎకరాల్లో ఈ స్మార్ట్‌సిటీని నిర్మిస్తున్నాం. రెండో దశతో కలిపితే.. మొత్తం 12,500 ఎకరాల్లో స్మార్ట్‌సిటీ వస్తుంది’’ అని కిషన్‌రెడ్డి వివరించారు. తొలిదశ ప్రాజెక్టుకు అవసరమైన 3,245 ఎకరాల్లో.. 3,100 ఎకరాలు(దాదాపు 80ు) రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉందని ఆయన వెల్లడించారు. ‘‘రాష్ట్రానికి సంబంధించి షేర్‌ హోల్డర్స్‌ అగ్రిమెంట్‌, స్టేట్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే పలు ఉత్పాదక రంగాలకు ఊతం అందుతుంది’’అని వివరించారు.

Updated Date - Aug 29 , 2024 | 04:25 AM