Share News

నక్సలిజంపై కేంద్రం ఉక్కుపాదం..

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:20 AM

వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 2026 మార్చి నాటికి భారత్‌ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తామన్న కేంద్రం గత పదేళ్లలో నక్సల్స్‌ ఏరివేతే లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లు చేసింది.

నక్సలిజంపై కేంద్రం ఉక్కుపాదం..

  • 280 రోజుల్లో 202 మంది నక్సల్స్‌ హతం.. 2026కి మావోయిస్టు రహితంగా భారత్‌

  • 8 నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్‌ షా సమీక్ష

  • 8 ఎనిమిది రాష్ట్రాల సీఎంలు, సీఎ్‌సలు, డీజీపీలతో భేటీ

  • 8 తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత హాజరు

న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 2026 మార్చి నాటికి భారత్‌ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తామన్న కేంద్రం గత పదేళ్లలో నక్సల్స్‌ ఏరివేతే లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లు చేసింది. మావోయిస్టుల కుంచుకోటైన ఛత్తీ్‌సగఢ్‌పై ప్రత్యేకంగా గురి పెట్టింది. నక్సలిజం వైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్థి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి భారీ గా నజరానాలు ప్రకటించింది. మావోయిస్టుల వల్ల నష్టపోయిన కుటుంబాలను అక్కున చేర్చుకుంది. అందులో భాగంగానే సెప్టెంబర్‌ 20న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన 55 మంది మావోయిస్టు బాధితులతో సమావేశం అయ్యారు.


బాధితులు షా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘31 మార్చి 2026 మావోయిస్టులకు చివరి రోజు. అప్పటికి వామపక్ష తీవ్రవాద రహిత భారత్‌ను చూస్తాం. బస్తర్‌ మళ్లీ అందంగా, శాంతియుతంగా మారుతుంది.’’ అన్నారు. షా ప్రకటన చేసి నెలరోజులు కాకముందే ఛత్తీ్‌సగఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గత శుక్రవారం నారాయణ్‌పూర్‌- దంతేవాడ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్థ పెట్టిన కేంద్రం తన ఆపరేషన్లను ముమ్మరం చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 5 వరకు 202 మంది నక్సల్స్‌ హతమయ్యారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కి.మీ పొడవైన రోడ్లతోపాటు 6,000 మొబైల్‌ టవర్లు నిర్మించినట్టు కేంద్రం వెల్లడించింది.


  • నేడు అమిత్‌ షా కీలక భేటీ

దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమ వారం సమావేశంకానున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, బీహార్‌, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు హాజరవుతారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నట్టు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు సీఎస్‌, డీజీపీ, ఏపీ హోమంత్రి అనితతోపాటు సీఎస్‌, డీజీపీ ఆదివారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.


  • దంతేశ్వరి ఫైటర్స్‌.. బ్యాకప్‌

చర్ల: ఛత్తీ్‌సగఢ్‌లో దంతేశ్వరి ఫైటర్స్‌.. ఎన్‌కౌంటర్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌)గా పిలిచే ఈ మహిళా కమెండోలు సాయుధ బలగాలకు బ్యాక్‌పగానూ పనిచేయడం విశేషం. మూడు రోజుల కిందట నారాయణపూర్‌, దంతెవాడ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సుమారు 1200 మంది జవాన్లు పాల్గొన్నారు. వీరిలో దంతెవాడ జిల్లాకు చెందిన దంతేశ్వరి ఫైటర్స్‌ కూడా పాల్గొన్నారు. యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌లో భాగంగా దంతెవాడ జిల్లాలో 60 మంది మహిళా కమెండోలతో దంతేశ్వరి ఫైటర్స్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో లొంగిపోయిన నక్సల్స్‌తో పాటు స్థానిక యువత ఉన్నారు. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ మహిళా కమెండోలు కూడా పాల్గొన్నారు. ఎన్‌కౌంటర్‌ ముగిసిన తర్వాత మావోయిస్టుల మృతదేహాల తరలింపులోనూ మహిళలు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.


  • మరో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాల గుర్తింపు

చర్ల: ఛత్తీ్‌సగఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 31 మంది మావోయిస్టుల్లో మరో ఏడుగురిని దంతెవాడ పోలీసులు ఆదివారం గుర్తించారు. ఈ ఏడుగురిలో రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉన్న సుక్కు యాదవ్‌, విజయ్‌, సోహాన్‌, సుదర్‌ దౌడైతో పాటు కొర్రమ్‌ సోనూ, జమ్లీ ఉన్నారు. శనివారమే 16 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించి వారిపై ఉన్న రివార్డులను పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 23 మందిని గుర్తించగా.. మరో 8 మందిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మిగిలిన 8 మంది మృతదేహాల్లో ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Oct 07 , 2024 | 04:20 AM