Share News

CM Chandrababu Naidu: మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలి

ABN , Publish Date - Aug 26 , 2024 | 04:04 AM

‘మబ్బులు వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్లే నాయకత్వం ఉండాలి. పార్టీపై స్థానిక నాయకత్వం ప్రజల్లో నమ్మకం కలిగించాలి.

CM Chandrababu Naidu: మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలి

  • రాష్ట్ర టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు

  • పార్టీలో చేరికలకు ప్రోత్సాహం

  • యువ నాయకత్వానికి ప్రాధాన్యం

  • కమిటీల రద్దు .. త్వరలో అడ్‌హక్‌ కమిటీలు

  • చంద్రబాబుతో బాబూమోహన్‌ భేటీ

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘మబ్బులు వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్లే నాయకత్వం ఉండాలి. పార్టీపై స్థానిక నాయకత్వం ప్రజల్లో నమ్మకం కలిగించాలి. విశ్వాసాన్ని పెంచుకోవాలి’’ అని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో టీడీపీ నేతలతో అన్నారు. ఆదివారం, ఎన్టీఆర్‌భవన్‌లో ఆయన రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. రాష్ట్రంలో టీడీపీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు.


పార్టీనుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి ఆహ్వానించాలని, వారితో పాటు కొత్తవారిని కూడా చేర్చుకోవాలని సూచించారు. పార్టీకి గుర్తింపు తీసుకువచ్చే నాయకత్వం అవశ్యకత ఉందని.. నాయకుల సీనియారిటీని, పార్టీపట్ల అంకితభావాన్ని గౌరవిస్తూనే.. పార్టీలోకి కొత్తగా వచ్చే నాయకులను ప్రోత్సహిస్తామని, యువతకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకూ ఒకసారి తాను రాష్ట్ర పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తానని తెలిపారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయి నుంచి విస్తృత అభిప్రాయ సేకరణ చేపట్టి, రాష్ట్రస్థాయిలో సమీక్ష చేయాలని ముఖ్యనేతలకు సూచించారు.


అలాగే.. పార్టీ రాష్ట్ర కమిటీని చంద్రబాబు రద్దుచేశారు. దీంతో పార్లమెంటు, మండల, గ్రామ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలు కూడా రద్దయ్యాయి. సభ్యత్వ నమోదు కోసం రాష్ట్రస్థాయిలో, పార్లమెంటు నియోజకవర్గస్థాయిలో అడ్‌హాక్‌ కమిటీలను ఏర్పాటుచేయనున్నారు. ఏపీ, తెలంగాణాల్లో ఒకేసారి సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుందని చంద్రబాబు ప్రకటించారు. సభ్యత్వ నమోదు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఉంటుందని తెలిపారు. సభ్యత్వ నమోదు చేస్తూనే పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. కాగా.. సినీనటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌.. ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. త్వరలో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు.

Updated Date - Aug 26 , 2024 | 04:04 AM