Share News

CS Shanthi Kumari: కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయండి:సీఎస్‌

ABN , Publish Date - Sep 01 , 2024 | 04:10 AM

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున... ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

CS Shanthi Kumari: కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయండి:సీఎస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున... ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వర్షాలపై శనివారం ఆమె సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణతో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా... సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఎస్‌ చెప్పారు.


కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్టరేట్లు, జీహెచ్‌ఎంసీ, సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్ధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులను ప్రకటించే నిర్ణయాధికారం కలెక్టర్లదేనని అన్నారు. భారీ వర్షాలపై ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపర్చాలన్నారు.


గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ) బృందాలు హైదరాబాద్‌, విజయవాడలలో ఉన్నాయని, వీటి సహకారం కావాలనుకుంటే వెంటనే పంపిస్తామని అన్నారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్స్‌ను తెరవకుండా చూసుకోవాలన్నారు. డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని పోలీస్‌ కమీషనర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశామని తెలిపారు.

Updated Date - Sep 01 , 2024 | 04:10 AM