Bhadradri: భద్రాద్రి జిల్లాలో పౌరహక్కుల సంఘం నేతల అరెస్టు
ABN , Publish Date - Sep 15 , 2024 | 03:08 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయంపై విచారణకు
పోలీసుల చర్యపై ప్రజాసంఘాల నిరసన
మణుగూరు, హైదరాబాద్, సెప్టెంబరు 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయంపై విచారణకు పౌరహక్కుల సంఘం కమిటీ సభ్యులు కరకగూడెం మండలంలో పర్యటించేందుకు ప్రయత్నించగా వారిని శనివారం ఉదయం భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ నారాయణతో పాటు మరో 9 మంది నాయకులు మణుగూరు నుంచి వాహనాల్లో కరకగూడెం వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు శనివారం ఉదయం వారిని అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని ఆయా పోలీసుస్టేషన్లకు తరలించారు.
ఓ ప్రైవేటు బస్సులో వారిని ఖమ్మానికి తరలించారు. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేస్తూ వాస్తవాలను బయటకు రాకుండా చేసే ఇటువంటి ప్రయత్నాలను పౌర సమాజం నిరసించాలని కోరారు. ఈ అరెస్టులను సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంఽథా, పౌరహక్కుల సంఘం ఖమ్మం జిల్లా నేత ఆర్. మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ప్రజాఫ్రంట్, మహిళా సంఘం నేతలు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక స్టీరింగ్ కమిటీ నేతలు ఖండించారు.