Share News

CM Revanth Reddy: దామగుండం నేవీ రేడార్‌ కేంద్రం పనులను దగ్గరుండి చేయిస్తాం

ABN , Publish Date - Oct 16 , 2024 | 03:09 AM

దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు ఉండాలని, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా సాగాలని పిలుపునిచ్చారు.

CM Revanth Reddy: దామగుండం నేవీ రేడార్‌ కేంద్రం పనులను దగ్గరుండి చేయిస్తాం

  • దేశ రక్షణ అందరి బాధ్యత

  • నేవీ రేడార్‌ కేంద్రంపై వివాదం సరికాదు

  • దేశంలోనే రెండోది.. తెలంగాణకు గర్వకారణం

  • రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుంది

  • ప్రజలకు ఎలాంటి నష్టం, హాని ఉండవు

  • గత ప్రభుత్వంలోనే భూ బదలాయిపు.. నిధులు

  • రేడార్‌ కేంద్రం శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి

రంగారెడ్డి అర్బన్‌/పరిగి/వికారాబాద్‌/పూడూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు ఉండాలని, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో వీఎల్‌ఎఫ్‌ నేవీ రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన గౌరవ అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్‌, ఎన్‌ఎఫ్‌సీ తదితర విభాగాల యంత్ర పరికరాల తయారీలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రేడార్‌ కేంద్రం ఏర్పాటు ద్వారా ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని తెలిపారు.


దేశానికి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయని, వాటిలో ప్రయాణించే షిప్‌లను మానిటరింగ్‌ చేయడానికి వీలుగా వీఎల్‌ఎఫ్‌ నేవీ రేడార్‌ స్టేషన్‌ను దామగుండంలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని వివాదం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇక్కడ రేడార్‌ స్టేషన్‌ నిర్మిస్తే జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ అపోహాలు సృష్టిస్తున్నారని తప్పుబట్టారు. వారు దేశ రక్షణ గురించి ఆలోచించాలన్నారు. తమిళనాడులో 1990లోనే నేవీ రేడార్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారని, అక్కడ ప్రకృతికి, మనుషులకు ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. దేశానికి ఉపయోగపడే రెండో రేడార్‌ కేంద్రం మన ప్రాంతానికి రావడం సంతోషకరమన్నారు. దీని ప్రాధాన్యాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.


  • దేశం ఉంటేనే మనం ఉంటాం..

‘‘దేశం ఉంటేనే మనం ఉంటాం. మనం ఉంటేనే ప్రాంతం అభిృద్ధి చెందుతుంది. పర్యావరణ ప్రేమికులకు ఒక్కటే చెబుతున్నా. దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలం. దేశ భద్రతకు ముప్పు నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేస్తున్న ఈప్రాజెక్ట్‌ను వివాదం చేయడం సరికాదు. రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుంది. మేం దగ్గరుండి పని చేయిస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ స్టేషన్‌ కోసం 2017లోనే భూ బదలాయింపు జరిగిందని, నిధుల కేటాయింపు వంటి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలిపారు.


ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అడగగానే తాము కూడా ముందుకు సాగామని, దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దని, పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించానని చెప్పారు. అడ్డుకోవాలనుకునే వారికి దామగుండం శివుడే తెలివి ప్రసాదిస్తాడన్నారు. ఇది సురక్షితమైన ప్రాజెక్ట్‌ అని, లక్షల చెట్లు తీసేదేమీ లేదని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పేవారి మాటలు నమ్మవద్దన్నారు. దామగుండంలో ప్రజలు విశ్వసించే పవిత్ర దేవాలయం ఉందని, అక్కడికి ప్రజలు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేసి.. వచ్చి పోయేందుకు సౌకర్యం కల్పించాలని నావికా దళం అధికారులను కోరారు. నేవీ పాఠశాలలో 1/3 వంతు స్థానిక పిల్లలు చదువునేందుకు అవకాశం కల్పించాలన్నారు.


  • సముద్రాల్లో భద్రతనే కాపాడేందుకే..

దేశ భద్రతలో భాగంగా సముద్రాల్లో జలంతర్గాముల కదలికలను పసిగట్టి, అవసరమైన చర్యలు తీసుకేందుకునే వీఎల్‌ఎఫ్‌ రేడార్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటవుతోందని భారత నావికాదళం ప్రధానాధికారి దినేష్‌ త్రిపాఠి అన్నారు. దామగుండం రిజర్వ్‌ ఫారెస్టులో భాగమైన 2,900 ఎకరాల అటవీ భూమిని సైంటిఫిక్‌ సర్వే తర్వాత ఎంపిక చేసినట్లు తెలిపారు. వికారాబాద్‌లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక.. తమిళనాడులోని తిరునల్వేలిలో లోయలో ఉన్న వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌కు ఇది సహకరించడంతోపాటు నావికా దళానికి మరింత బలం చేకూరుతుందన్నారు. సముద్రాలపై నియంతరణ మెరుగుపరచడం, వ్యూహాత్మక శక్తిని పెంచడమనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి కూడా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అతి తక్కువ ఫ్రీక్వెన్సీతో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు, ఈ తరంగాలతో మానవులకు, జంతుజాలానికి ఎలాంటి హానీ ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, కేంద్ర మంత్రి బండి సంజయ్‌, భారత నావికాదళం ప్రధానాధికారి దినేశ్‌, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


  • సీఎం ప్రొటోకాల్‌లో ఇబ్బందులు

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌ ద్వారా వికారాబాద్‌కు చేరుకోవాల్సిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గాన దామగుండంకు వేర్వేరు వాహనాల్లో చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో సీఎం రేవంత్‌రెడ్డికి ప్రొటోకాల్‌ విషయంలో అధికారులు నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సభా వేదిక నుంచి కూడా హెలిప్యాడ్‌ వరకు వేర్వేరు వాహనాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. సీఎం రేవంత్‌రెడ్డి వాహనం రాలేదు. దాంతో ఆయన రాజ్‌నాథ్‌సింగ్‌ వాహనంలో ఎక్కి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. కాగా, వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి నేవీ, ఆర్మీ, పోలీస్‌ శాఖల అద్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి, సీఎం కలెక్టరేట్‌ ఆవరణలోని హెలిప్యాడ్‌ వద్దకు చాపర్‌ ద్వారా చేరుకుంటారని పోలీసులు ఎన్నేపల్లి నుంచి కలెక్టరేట్‌ వరకు అడుగడుగనా పోలీస్‌ భద్రతను ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టారు. వాతావరణంలో మార్పుల వల్ల హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డు మార్గాన వాహనాల్లో రావడంతో భద్రతా సిబ్బంది పరుగులు పెట్టారు.

Updated Date - Oct 16 , 2024 | 03:09 AM