Share News

Congress: రేవంత్‌, భట్టికి అధిష్ఠానం పిలుపు

ABN , Publish Date - Aug 22 , 2024 | 03:38 AM

రాష్ట్రంలో 8 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ పని తీరును సమీక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అధిష్ఠానం భేటీ కానుంది.

Congress: రేవంత్‌, భట్టికి అధిష్ఠానం పిలుపు

  • నేడు లేదా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం.. అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ఖర్గేతో భేటీ

హైదరాబాద్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 8 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ పని తీరును సమీక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అధిష్ఠానం భేటీ కానుంది. ఢిల్లీలో శుక్రవారం జరిగే ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఇతర ఏఐసీసీ పెద్దలూ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ భేటీలో పాల్గొనేందుకు గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


రాష్ట్రంలో పార్టీ నూతన అధ్యక్ష పదవి సహా టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్ఠానం ముందు ఇప్పటికే పలు ప్రతిపాదనలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖర్గే, రాహుల్‌తో జరిగే భేటీ కీలకం కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడే ఈ అంశాలపై అధిష్ఠానంతో చర్చలు జరగాల్సి ఉంది. అయితే, అప్పుడే మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం, రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్‌ మను సింఘ్వి నామినేషన్‌కు ముందు ఇలాంటివి పెట్టుకోవద్దని అధిష్ఠానం భావించడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది.


అయితే, ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ స్థానంలో ఛత్తీ్‌సగఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ భగేల్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా సీఎం, డిప్యూటీ సీఎంల అభిప్రాయం తీసుకోనున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీగౌడ్‌, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పార్టీ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎస్టీ కేటగిరీ నుంచి బలరాం నాయక్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, మంత్రి పదవుల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూ నాయక్‌, రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌, సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి పోటీ పడుతున్నారు.


ప్రచార కమిటీ చైర్మన్‌గా తూర్పు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భేటీలో ఈ అంశాలపై ఖర్గే, రాహుల్‌ సమీక్ష చేపట్టనున్నారు. అవసరమైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణా చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో రూ.2లక్షలమేర రుణమాఫీ నేపథ్యంలో వరంగల్‌లో తలపెట్టిన కృతజ్ఞతా సభకు రాహల్‌గాంధీ వచ్చే తేదీలూ ఖరారయ్యే అవకాశం ఉంది.

Updated Date - Aug 22 , 2024 | 03:38 AM