Share News

CM Revanth Reddy: భవిష్యత్తులో మొత్తం సన్నాల సాగే!

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:21 AM

ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగులో 58 శాతం సన్న రకాలు పండించారని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.500 ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సన్నాల సాగు, దిగుబడి మరింత పెరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: భవిష్యత్తులో మొత్తం సన్నాల సాగే!

  • ఈ సీజన్‌ నుంచే రూ.500 బోనస్‌... 48 గంటల్లో జమ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం

  • ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు 7వేల కేంద్రాలు

  • సన్నాల పేరిట గోల్‌మాల్‌ జరగకుండా అధికారులు చూడాలి

  • రైతులను మోసం చేస్తే క్రిమినల్‌ కేసులు

  • బ్యాంకు గ్యారంటీ తీసుకున్నాకే మిల్లర్లకు ధాన్యం

  • జనవరి నుంచి రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగులో 58 శాతం సన్న రకాలు పండించారని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.500 ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సన్నాల సాగు, దిగుబడి మరింత పెరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమంగా రాష్ట్రంలో వంద శాతం సన్న వడ్లు పండించే రోజులు వస్తాయన్నారు. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్‌ లేదని, ఎఫ్‌సీఐ వద్ద కూడా భారీగా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పారు. అందుకే సన్న రకాల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు.


రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్‌ నుంచే సన్నాలకు ఎమ్మెస్పీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని స్పష్టం చేశారు. గత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా ఇంకా ఎక్కడైనా అవసరమని కలెక్టర్లు భావిస్తే ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసిందని చెప్పారు. సన్న వడ్లకు బోనస్‌ ఇవ్వటం ఇదే మొదటిసారి కావటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు.


సన్న వడ్ల ేసకరణకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు గానీ, లేదా కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సన్న రకాలను ధ్రువీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. వాటి సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్‌మాల్‌ జరిగే ప్రమాదముంటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రతి కేంద్రానికి ఒక నెంబరు కేటాయించాలని, అక్కడ కొన్న వడ్ల సంచులపైన ఆ నెంబరు తప్పకుండా వేయాలన్నారు. దీంతో ఏదైనా తప్పు జరిగితే ఎక్కడ జరిగిందో సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని అదేశించారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించవద్దని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెట్టాలన్నారు. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురికాకూడదని, వారి నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును జిల్లా కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్‌ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలను చేరవేయాలని, దానికి అనుగుణంగా ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి రోజూ కలెక్టర్లు తమ జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించాలని, ఉదయం కేంద్రాలకు వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పాత పది జిల్లాలకు నియమించిన ప్రత్యేకాధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. సమస్యలుంటే ఏ రోజుకారోజు పరిష్కరించాలని, పౌర సరఫరాల విభాగంలో 24/7 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే జనవరి నుంచి రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఈసారి దిగుబడి వచ్చే 146 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో ట్రేడర్లు, మిల్లర్లు, కొనేది, రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు పక్కన పెడితే 91 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశామన్నారు. అందులో 44 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం, 47 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకాలు ఉంటాయని చెప్పారు. గతంలో వరుసగా బకాయిపడిన డిఫాల్టర్‌ మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల చేయొద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇతర రైస్‌ మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ తీసుకొని ధాన్యం కేటాయింపులు చేయాలని సూచించారు.


  • డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయండి

అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను 5వ తేదీలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబరు 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మొత్తం 11,062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు.

Updated Date - Oct 04 , 2024 | 04:21 AM