Share News

Congress: 3 నెలలు ఉండాలంటే ఒక్క రాత్రి షో చేస్తారా?

ABN , Publish Date - Nov 17 , 2024 | 04:27 AM

మూసీ కంపులో మూడు నెలలు ఉండాలంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరితే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక్క రాత్రి ఉండి షో చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు.

Congress: 3 నెలలు ఉండాలంటే ఒక్క రాత్రి షో చేస్తారా?

  • బీజేపీ మూసీ నిద్రపై కాంగ్రెస్‌ నేతల ధ్వజం

  • మూసీ ప్రాజెక్టును అడ్డుకోవద్దంటూ ఆగ్రహం

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మూసీ కంపులో మూడు నెలలు ఉండాలంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరితే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక్క రాత్రి ఉండి షో చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు. ఒక్క రాత్రి బస్తీలో బస చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మూసీ బాఽధితుల పట్ల బీజేపీ నేతలకు ఏమాత్రం ప్రేమ ఉన్నా మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చి సహకరించాలన్నారు. బీజేపీ మూసీ నిద్రపై వేర్వేరు మీడియా సమావేశాలు, ప్రకటనల్లో ఈ మేరకు స్పందించారు. మూసీ పరీవాహక బస్తీల్లో నిద్ర అంటున్న బీజేపీ నేతలు.. దోమ తెరలు, ఫ్యాన్లు, మాస్కులు లేకుండా ఆరు బయటే నిద్రపోవాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. ‘మూసీ ప్రక్షాళన కావాలంటూనే అక్కడి నుంచి ఎవరినీ ఖాళీ చేయించవద్దంటూ కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నడు. గంగా, సబర్మతీ నదుల ప్రక్షాళన కోసం బీజేపీ ప్రభుత్వాలు ఎవరినీ ఖాళీ చేయించలేదా?’ అంటూ ప్రశ్నించారు.


మూసీ నది కాలుష్యంతో పరీవాహక ప్రజలు, రైతులు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారని, మూసీ ప్రక్షాళనను బీజేపీ నేతలు రాజకీయం చేయవద్దని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ కోరారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న కిషన్‌రెడ్డి.. మూసీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న నల్లగొండ ప్రజలకు సమాధానం చెప్పాలని మరో ఎమ్మెల్యే మందుల సామేలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ‘బస్తీల్లో కిషన్‌రెడ్డి నిద్రిస్తే తప్పు లేదు. కానీ కేవలం మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడడమే లక్ష్యంగా వెళ్లడమే తప్పు’ అని అన్నారు. మూసీ పరీవాహక బస్తీల్లో కిషన్‌రెడ్డి ఒకరోజు నిద్రతో పాటుగా ఉదయం లేచి మూసీ నీటితో స్నానమూ చేయాలంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్‌ సూచించారు.


  • కేటీఆర్‌ జైలుకు వెళ్లక తప్పదు..

జైలుకు పోతానంటూ తొందరపడుతున్న కేటీఆర్‌.. త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఫార్మా సిటీ కోసం ఆనాడు 14 వేల ఎకరాలు సేకరించారని, లగచర్ల తరహాలో తాము దాడులు చేసి ఉంటే ఒక్క ఎకరా అయినా తీసుకోగలిగేవారా అంటూ ప్రశ్నించారు. లగచర్లలో ఏర్పాటు చేస్తున్నది ఇండస్ట్రియల్‌ పార్కు మాత్రమేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌ కౌశిక్‌యాదవ్‌ చెప్పారు. పరిహారం కింద రైతులకు సర్కారు ఎకరాకు రూ.40 లక్షల చొప్పున చెల్లిస్తుందన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 04:27 AM