CM Revanth Reddy: పదేళ్లలో మీరు చేయనిది.. పది నెలల్లోనే..
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:03 AM
తెలంగాణ ఏర్పడ్డాక గత ప్రభుత్వం పదేళ్లలో చేయనిది.. తాము ప్రజా ప్రభుత్వంలో పది నెలల్లో చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో చేసి చూపించాం
ఏడాదిలో 55 వేల ఉద్యోగాలిచ్చాం
గుజరాత్‌లో మీరు ఇచ్చారా?
మా ఉద్యోగులను తీసుకువస్తా.. చూపించండి
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్
ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తామా కేసీఆర్?
పెళ్లి చేయగానే పిల్లలు పుడతారా?
కోటి మంది మహిళలను
కోటీశ్వరులను చేస్తాం పెద్దపల్లి ‘యువ వికాసం’లో సీఎం
9వేల మందికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత
రూ.1024 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పెద్దపల్లి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పడ్డాక గత ప్రభుత్వం పదేళ్లలో చేయనిది.. తాము ప్రజా ప్రభుత్వంలో పది నెలల్లో చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 11 ఏళ్లు ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. గుజరాత్‌లో ఇలా ఇచ్చినట్లు నిరూపిస్తామంటే తెలంగాణ ఉద్య్గోగులను అక్కడికి తీసుకువస్తానని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు సవాల్ విసిరారు. వారు కూడా వస్తానంటే విమాన చార్జీలూ చెల్లిస్తానన్నారు. తమ ప్రభుత్వంలా రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశారా? అని, చేస్తే లెక్కలు తీయాలని అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ వికాసం బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు.
పెద్దపల్లిలో ఆర్టీసీ బస్ డిపో, రూ.1024.90 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు వేదిక మీద నుంచే శంకుస్థాపన చేశారు. 9వేల మంది గ్రూప్-4, అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, సింగరేణి ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. స్కిల్ యూనివర్సిటీ కోసం ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుని, డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ తెలంగాణ, సీఎం కప్‌ను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని వర్గాలనూ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తాము పది నెలల్లోనే రుణమాఫీ, ఉద్యోగాలు, రైతులకు బోనస్, మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చామని వివరించారు. ఇవన్నీ కేసీఆర్ చేసి ఉంటే తాము అధికారంలోకి వచ్చే వాళ్లమా? అని ప్రశ్నించారు. ‘‘ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తామా? అప్పుడే అంత ఆత్రుత ఎందుకు? కేసీఆర్ పదేళ్లలో మహిళలను అవమానపరిచారు. వాళ్లు ఎలా ఉన్నారని కూడా అడగలేదు. మేం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మీ కోటి ఓట్లు మాకు పడితే మళ్లీ గెలుపు ఖాయం. బీఆర్‌ఎస్ మళ్లీ లేవదు’’ అని సీఎం రేవంత్ అన్నారు.
చిన్నారెడ్డితో తెలంగాణ ఉద్యమం
‘‘కరీంనగర్ అంటే 2004లో సోనియాగాంధీ ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 60 ఏళ్ల పోరాటం, ఉద్యమకారుల ప్రాణత్యాగాలను సోనియా గుర్తుంచుకుని తెలంగాణ ఇచ్చారు. 2001లోనే చిన్నారెడ్డి ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఆ ఉద్యమం కొద్ది కొద్దిగా పెరిగి ఉర్రూతలూగింది. సింగరేణి ఉద్యోగాల కోసం మొదలైన పోరాటం తెలంగాణ ఉద్యమానికి దారి తీసింది. సాయుధ పోరాటం చేస్తే రాజ్యమే పోయి రాష్ట్రం వచ్చింది. 1969లో ఉద్యోగులతో పోరాటం మొదలయిరది’’ అని సీఎం అన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణకు పదేళ్లు పాలించిన కేసీఆర్ ఏమీ చేయలేదని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ మాత్రం ఎకరం పొలంలో కోటి రూపాయల ఆదాయం పొందే రహస్యం మాత్రం రైతులకు చెప్పలేదని ఎద్దేవా చేశారు. రైతాంగానికి ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వకపోతే పోరాటం చేసిన ప్రస్తుత పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును గత పాలకులు కరీంనగర్ జైల్లో బంధించారని గుర్తు చేశారు.
ఇద్దరిని ఊరిమీదకు వదిలాడు..
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వం లక్షా 2 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కూలిపోయిందన్నారు. ‘‘కేసీఆర్ ఇంట్లో పడుకొని ఇద్దరిని ఊరి మీదకు వదిలితే, వాళ్లు అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతున్నారు. రాళ్లు విసిరి.. చెట్లలో దాక్కుంటున్నారు. మేం ఏమి చేశామో, మీరేమి చేశారో చర్చించుకుందాం అసెంబ్లీ రమ్మంటే ఎందుకు రావడంలేదు? కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించాం’’ అని రేవంత్ తెలిపారు. గతంలో ఐకేపీ కేంద్రాలు తెరవమంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని, వరి వేస్తే ఉరి వేసుకోవాలని అని కర్కశంగా చెప్పింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. సన్న ధాన్యం పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఐదు రోజుల్లో ఇచ్చామన్నారు. కేసీఆర్ రైతుబంధు ఎగ్గొడితే తాము రూ.7,625 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోమని తెలిపారు. సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీలో బస్సులను పెట్టిస్తామన్నారు.
ఇంజనీరింగ్, లా కాలేజీ మంజూరు..
శాతావాహన విశ్వవిద్యాలయానికి ఇంజినీరింగ్, లా కళాశాల మంజూరు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మంథని ప్రాంతానికి కోకాకోలా ఫ్యాక్టరీ తీసుకువస్తామన్నారు. గత ప్రభుత్వం సమస్యలపై ఇందిరా చౌక్ వద్ద ధర్నాలు చేయకుండా తాళం వేస్తే తాము తెరిపించామన్నారు. కొంత మంది నిరుద్యోగులు అశోక్‌నగర్, రాంనగర్ చౌరస్తాలో ధర్నా చేస్తే గాంధీభవన్‌కు పిలిపించి మాట్లాడామన్నారు. దొరలు, పెత్తందారులకు మాత్రమే ప్రవేశం ఉండే ప్రగతి భవన్‌ను జ్యోతిభా పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చి ప్రజల నుంచి రెండు రోజులు విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. కవిత ఉద్యోగం ఊడితే వెంటనే ఎమ్మెల్సీ, వినోద్‌కు మరో ఉద్య్గోగం ఇచ్చారని, ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది? ఒక్క కుటుంబం కోసమేనా? అనే విషయంపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
‘‘వాళ్ల బాధ, శాపనార్థాలు ఎందుకో అర్థం కావడం లేదు. మాకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు తెలియదా? ఒక్కరోజే అన్నీ చేయాలంటే అవుతాయా? మేమేమీ అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చాం. మీరు ఉన్నప్పుడు మేం ఇట్లాగే చేశామా? జానారెడ్డి, భట్టి విక్రమార్క మీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వలేదా?’’ అని ప్రశ్నించారు. గతంలో వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు తేలేదని, నేడు ప్రజా ప్రభుత్వం వాటి ఏర్పాటుకు కృషి చేస్తుందని తెలిపారు. 95ు కులగణన పూర్తి చేసుకున్నామని, కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, సంతో్‌షరావు, వినోద్‌రావు ఎందుకు కుల గణనలో పాల్గొనడం లేదని ప్రశ్నించారు. బీసీల ఓట్లను దండుకున్నారని, మీకు బీసీలంటే వ్యతిరేకమా లేక ద్రోహులా? అని బీసీ సంఘాలు ప్రశ్నించాలన్నారు.
కొలువుల కలలు.. నిజమైన క్షణం
‘‘మొన్న కొలువులే ఆలంబనగా.. కొలిమిలా మండిన ఉద్యమం. నిన్న కొలువులే ఆకాంక్షగా జంగ్ సైరనై మోగిన నా రణం. నేడు కొలువుల కలలు.. నిజమైన క్షణం. ప్రజాపాలనలో యువ వికాస వసంతం. ఏడాదిలో 55వేల ఉద్యోగాల నియామకం. నిత్య నోటిఫికేషన్ల తోరణం. ఏడాది ప్రజాపాలనలో తగ్గుతున్న నిరుద్యోగం. ఈ సంతోషాన్ని ఆ ఆనందాన్ని నా యువ మిత్రులతో పంచుకునేందుకు వస్తున్నా పెద్దపల్లికి’’
- ఎక్స్‌లో సీఎం రేవంత్