CM Revanth Reddy: కొడంగల్‌లో ఫార్మాసిటీ కాదు.. పారిశ్రామిక కారిడార్
ABN , Publish Date - Nov 24 , 2024 | 03:09 AM
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసేది పారిశ్రామిక కారిడారేనని, ఫార్మాసిటీ కాదని తేల్చిచెప్పారు.
నా ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా..?
వామపక్ష పార్టీల నాయకులతో సీఎం రేవంత్‌రెడ్డి
డిసెంబరు 1 నుంచి 9 వరకు ఏడాది సంబరాలు
4న పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో భారీ సభ
పలువురికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత
9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
30న పాలమూరులో రైతుల అవగాహన సదస్సు
హైదరాబాద్‌కు 20 టీఎంసీల గోదావరి జలాలు
1న టెండర్లకు వెళ్లాలి.. అధికారులతో భేటీల్లో సీఎం
రాష్ట్రంలో 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వెల్లడించిన అధికారులు
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసేది పారిశ్రామిక కారిడారేనని, ఫార్మాసిటీ కాదని తేల్చిచెప్పారు. కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని, అక్కడి యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని తెలిపారు. ‘‘నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతాను?’’ అని ప్రశ్నించారు. శనివారం సచివాలయంలో తనను కలిసిన వామపక్ష పార్టీల నేతలతో సీఎం రేవంత్ పై విధంగా వ్యాఖ్యానించారు. సేకరిస్తున్న భూములకు అందించే పరిహారాన్ని పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వారిని వదిలిపెట్టబోమన్న సీఎం.. ఈ ఘటనలో రైతులపై నమోదైన కేసుల విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కాగా లగచర్ల ఘటన, అనంతర పరిణామాలపై సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు సహా పలువురు వామపక్ష నేతలు సీఎంకు వినతిపత్రం అందించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో అధికారం చేపట్టి డిసెంబరు 7నాటికి ఏడాది అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబరు 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం సాయంత్రం సచివాలయంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలన్నారు.
4న పెద్దపల్లిలో సభ..
తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. డిసెంబరు 4న పెద్దపల్లి జిల్లాల్లో యువతతో విజయోత్సవ సభ జరపాలని నిర్ణయించారు. అదే వేదికగా గ్రూప్-4తోపాటు వివిధ పోస్టులకు ఎంపికైన 9వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక డిసెంబరు 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. డిసెంబరు 9న సచివాలయం ముఖద్వారం ఎదుట ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం నిర్ణయించారు. ఆరోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉ ద్యమకారులను, మేధావులను, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని సూచించారు.
శాఖలవారీగా ప్రగతి నివేదికలు..
డిసెంబరు 1 నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులకు సీఎం సూచించారు. వివిధ అభివృద్థి కార్యక్రమాలతోపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. తమ శాఖల వారీగా రోజుకో మంత్రి తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతోపాటు భవిష్యత్తు ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. డిసెంబరు 7 నుంచి మూడు రోజులపాటు సచివాలయ పరిసరాలు, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిేసలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మూడురోజులపాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టిపడే కార్యక్రమాలతోపాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో, డ్రోన్ షోలను నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించ తలపెట్టిన రైతు సదస్సును 28 నుంచి మూడు రోజులపాటు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులందరూ పాల్గొనేలా చూడాలన్నారు. దీనిని బహిరంగ సభలా కాకుండా వ్యవసాయ రంగంలో రైతులకు అవగాహన కలిగించేలా అవగాహన సదస్సుగా నిర్వహించాలని సూచించారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారులతో రేవంత్ సమావేశమయ్యారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీలు
హైదరాబాద్ నగరం తాగునీటి అవసరాల కోసం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి 20 టీఎంసీల గోదావరి నీటి తరలింపునకు సంబంధించి సమగ్ర నివేదిక తయారు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుందనే వివరాలతోపాటు నీటి లభ్యతపై అధ్యయనం చేయాలన్నారు. డిసెంబరు 1న టెండర్లకు వెళ్లేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ మేరకు శనివారం తన నివాసంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన సీఎం
సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మరోమారు పరిశీలించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో సమావేశం ముగిసిన అనంతరం విగ్రహ పనుల వద్దకు వెళ్లారు.
23 లక్షల మందికి రుణమాఫీ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు 23 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు. ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాల పేర్లలో తప్పులు, కుటుంబాల నిర్ధారణ కారణాలతో కొన్నిచోట్ల కొంతమందికి రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. రుణమాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పథకం కింద ఇప్పటివరకు జరిగిన మాఫీ వివరాల నివేదికను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు.