CM Revanth Reddy: సర్పంచి ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల్లా!
ABN , Publish Date - Dec 03 , 2024 | 03:32 AM
‘‘సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వస్తాయి. జోలెలో బిచ్చంపడగానే పోతాయి. అలాగే, ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికల కోసం వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారును బద్నాం చేసే ఆ పార్టీలకు కర్రుకాల్చి వాత పెట్టాలి’’ అంటూ బీఆర్‌ఎస్, బీజేపీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వస్తున్నాయ్
పది సంవత్సరాల్లో ఏమీ చేయని పార్టీలు పది నెలల
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయి
కర్రు కాల్చి వాతపెట్టాలి.. విష ప్రచారం తిప్పికొట్టాలి
రుణ మాఫీ, భరోసాతో కొందరి గుండెల్లో పిడుగులు
ఫామ్‌హౌజ్‌లో పడుకున్నోళ్లకు మనశ్శాంతి లేదు
చిన్న ఆరోపణ కూడా లేకుండా టీజీపీఎస్సీ పనితీరు
త్వరలోనే గ్రూప్-1 నియామక పత్రాలు అందజేస్తాం
ప్రపంచ పారిశ్రామిక ఆకర్షణ శక్తిగా తెలంగాణ
ఆరోగ్య ఉత్సవాలు, కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభంలో
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర పనితీరుకు కితాబు
హైదరాబాద్, సిద్దిపేట, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వస్తాయి. జోలెలో బిచ్చంపడగానే పోతాయి. అలాగే, ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికల కోసం వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారును బద్నాం చేసే ఆ పార్టీలకు కర్రుకాల్చి వాత పెట్టాలి’’ అంటూ బీఆర్‌ఎస్, బీజేపీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, పదకొండో ఏడాది అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఏం చేశాయని నిలదీశారు. పదేళ్లపాటు వాళ్లు ఏమీ చేయలేనప్పుడు పది నెలల్లోనే తాము ఎలా అభివృద్ధి చేయగలుగుతామని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని, సర్కారుపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు ఆకర్షణ శక్తిగా తెలంగాణ వెలుగొందుతోందని, వ్యాపారాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ)కి చెందిన గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. సమగ్ర విధానం అనుసరిస్తున్న హెచ్‌సీసీబీని అభినందిస్తున్నానని, ఉద్యోగ ఉపాధి కల్పనతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి గణనీయంగా ఉపయోగపడుతుందని వివరించారు. రుణ మాఫీ, రైతు భరోసాతో కొంతమంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయని బీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత పాలకులు వరి వేసుకుంటే ఉరేనని అన్నారని, తమ ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తోందని, సన్న వడ్లకు ఇస్తున్న బోన్‌సతో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారని వివరించారు. వచ్చే పదేళ్లూ తామే అధికారంలో ఉంటూ బోన్‌సను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కచ్చితంగా ఇచ్చి తీరతామని పునరుద్ఘాటించారు. అందుకే, ‘‘ఫామ్ హౌజ్‌లో పడుకున్నోళ్లకి మనశ్శాంతి లేదు. వాళ్ల గుండెల్లో మంటకు మందు లేదు. ఆయనకు కావాల్సిన మందును మా మంత్రి జూపల్లి కృష్ణారావు శాఖ నుంచే ఇవ్వగలం’’ అని ఎద్దేవా చేశారు.
త్వరలోనే గ్రూప్-1 నియామక పత్రాలు
గ్రూప్ 1 ఉద్యోగాల నియామక పత్రాలను త్వరలోనే అందజేస్తామని, 563 మంది అధికారులను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2011 తర్వాత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదని, 13 ఏళ్ల తర్వాత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు 563 మంది గ్రూప్-1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారని, టీజీపీఎస్సీ పనితీరుకు ఇది గీటురాయి అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం టీజీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని, ఆర్‌ఎంపీ డాక్టర్లు, డిప్యూటీ ఎమ్మార్వోలను దానికి సభ్యులుగా నియమించిందని మండిపడ్డారు. సర్వీస్ కమిషన్‌ను బీఆర్‌ఎస్ పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లలా టీజీపీఎస్సీని తాము రాజకీయ పునరావాసంగా మార్చబోమని స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడు చిన్న ఆరోపణ కూడా లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోంది.
మూడున్నరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశాన్ని కమిషన్ చైర్మన్‌గా, ఉన్నత చదువులు చదువుకున్న వారిని సభ్యులుగా నియమించాం’’ అని స్పష్టం చేశారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం తెలంగాణ ఉద్యమంలో యువత రోడ్లపైకి వచ్చి పోరాడిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. కానీ, గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టకుండా ప్రశ్నపత్రాలను అమ్ముకుందని మండిపడ్డారు. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేసిన తర్వాతే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయని మరోమారు గుర్తు చేశారు. ‘‘డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత కృత్రిమ ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించాం. తెలంగాణ యువతపై మా ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని కోర్టులకు వెళ్లినా న్యాయస్థానాలు సమర్థించలేదు. పరీక్ష వాయిదా కోసం కొందరు కృత్రిమ ఉద్యమాలు చేశారు. పదేళ్లపాటు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను బీఆర్‌ఎస్ నియమించలేదు. మేం వచ్చిన తర్వాత నియమించాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. ఏడాది కాలంలో రూ.835 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలకు ఇవ్వడం ఒక రికార్డు’’ అని స్పష్టం చేశారు.
వైద్య శాఖలో ఏడాదిలో 14వేల ఉద్యోగాలు
ఒక్క ఏడాది కాలంలోనే ఆరోగ్య శాఖలో 14 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, 7,750 మంది పారామెడికల్ సిబ్బందికి ఎల్బీ ేస్టడియంలో నియామక పత్రాలను అందజేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహ సమర్థంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. గత ప్రభుత్వం ఎనిమిది వైద్య కళాశాలలకు జీవోలిచ్చి చేతులు దులుపుకొందని, ఎలాంటి వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. తాము వచ్చిన తర్వాత వాటిలో అన్ని రకాల సదుపాయాలు కల్పించడమే కాకుండా కేంద్రాన్ని ఒప్పించి వాటికి అనుమతులు సాఽధించామని వివరించారు. వైద్య శాఖలో 6,500 మందిని నియమించాలని నిర్ణయించామని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యం విద్య, వైద్యమేనని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెట్టాలన్న ఆలోచన కూడా గత పాలకులకు రాలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గత పాలకులు నెరవేర్చలేదు. పదేళ్లపాటు అధికారంలో ఉండి జయ జయహే పాటను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం కాదా?’’ అని రేవంత్ నిలదీశారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో తెలంగాణ ప్రభుత్వ ఏడాది విజయోత్సవాలకు ప్రజలు తరలిరావాలని కోరారు.
రూ.2,091 కోట్లతో కోకాకోలా ఫ్యాక్టరీ
బండ తిమ్మాపూర్‌లో 49 ఎకరాల్లో రూ.2,091 కోట్లతో కోకాకోలా ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఏడు రకాల ఉత్పత్తులను అందించనున్నామని సీఎం రేవంత్‌కు మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. పారిశ్రామికాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు ఈ ఫ్యాక్టరీ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీజీఐఐసీ చైర్‌పర్సన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, సంస్థ సీఈవో జువాన్ పాబ్లో రోడ్రిగ్స్‌తో కలిసి రేవంత్‌రెడ్డి కోకాకోలా ఫ్యాక్టరీని సందర్శించారు.
రసాభాసగా కార్యక్రమం
కోకాకోలా ఫ్యాక్టరీని ప్రారంభించడానికి సీఎం రేవంత్ లోపలికి వెళుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ గేట్లు దూకి రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సీఎం వెంట తనతోపాటు తన అనుచరులను అనుమతించలేదని, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తనను కాదని మరో నేత బండారు శ్రీకాంత్‌రావు వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆందోళనకు దిగారు. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు టెంటు తొలగించి, ఫ్లెక్సీలు చింపేశారు. దాంతో, నర్సారెడ్డి వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నర్సారెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి లోపలికి పిలిపించి మాట్లాడారు. కొద్దిసేపటికే ఆందోళన సద్దుమణిగింది.
వైద్యులకు నియామక పత్రాలు అందించిన సీఎం
ఇటీవలే నియమితులైన 422 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లలో కొందరికి; ఫుడ్ సేఫ్టీ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం 16 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 ఎలైడ్ హెల్త్ సైన్స్ కాలేజీలు; ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటు చేసిన 32 మైత్రి క్లినిక్‌లను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. కొత్తగా కొనుగోలు చేసిన 213 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఒక్కోదాంట్లోకి వెళ్లి పరిశీలించారు.
హైదరాబాద్ అభివృద్ధికి 3,446 కోట్లతో ప్రాజెక్టులు
నేడు శంకుస్థాపన చేయనున్న రేవంత్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా పాలన ఏడాది విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకురార్పణ చేయనున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో రూ.3,446 కోట్లతో వీటికి శంకుస్థాపన చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు ప్రసాద్ ఐ మ్యాక్స్ పక్కనున్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారు. వంతెనలు, అండర్‌పా్‌సలు, కారిడార్ల అభివృద్ధి, నాలాల విస్తరణ, రీ మోడలింగ్ వంటి పనులను హెచ్-సిటీలో భాగంగా చేపడుతున్నారు. గ్రేటర్‌లోని ప్రధాన కూడళ్లు, రహదారులపై రూ.150 కోట్లతో చేపడుతున్న సుందరీకరణ పనులూ ప్రారంభిస్తారు. రోడ్లపై వరద నీరు నిలవకుండా ప్రధాన రహదారుల్లోని 12 ప్రాంతాల్లో రూ.16.50 కోట్లతో నీటి సంపులను నిర్మిస్తున్నారు. సచివాలయం ఎదురుగా, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో నాలుగు నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటిని సీఎం ప్రారంభించనున్నారు. ట్యాంక్ బండ్‌లో 9న నిర్వహించనున్న విజయోత్సవాల ముగింపు వేడుకలకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ట్రాన్స్‌జెండర్లతో ముఖ్యమంత్రి మాటా ముచ్చట
స్టాల్స్‌ను పరిశీలిస్తున్న క్రమంలో వైద్య ఆరోగ్య, దివ్యాంగ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ల స్టాల్‌లోకి సీఎం, మంత్రులు వెళ్లారు. అక్కడ ప్రేమలీల అనే ట్రాన్స్‌జెండర్ సీఎంతో మాట్లాడారు. తమకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తమ కోసం మైత్రి క్లినిక్‌లను ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. తమను జనజీవన స్రవంతిలోకి తీసుకు వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ట్రాఫిక్ కంట్రోల్ చేసే సిబ్బందిగా త్వరలో ట్రాన్స్‌జెండర్స్‌ను నియమిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
ఇదీ మా రికార్డు
‘‘75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం ఒకే ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ గొప్ప చరిత్ర సృష్టించింది. ఏడాదిలో రూ.835 కోట్లను సీఎంఆర్‌ఎఫ్ కింద ప్రజలకు ఇచ్చాం. ఇదొక రికార్డు. ఎవరు అడ్డు పడినా.. డీఎస్సీ నిర్వహించి 55 రోజుల్లోనే నియామక పత్రాలు అందించాం. మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం’’.
- సీఎం రేవంత్ రెడ్డి