Share News

CM Revanth Reddy: ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు

ABN , Publish Date - Oct 10 , 2024 | 04:07 AM

తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, కానీ.. బీఆర్‌ఎస్‌ మాత్రం తమ ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామంటోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు

  • తెలంగాణ సమాజంపై ఎందుకింత కోపం?.. రెండుసార్లు కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నాం

  • ఆ దెయ్యం పేదలను పట్టించుకోలేదు

  • నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలే

  • మేం నోటిఫికేషన్లు వేస్తే అడ్డుకుంటున్నారు

  • బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం రాదు..

  • తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్లే కీలకం

  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, కానీ.. బీఆర్‌ఎస్‌ మాత్రం తమ ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామంటోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది న్యాయమా? తెలంగాణ సమాజంపై ఆ పార్టీకి ఎందుకింత కోపం? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌సకు మళ్లీ అధికారం రాదని, తెలంగాణ ప్రజలు ఇవ్వరని అన్నారు. తండ్రీ కొడుకుల ఉద్యోగాలను ఊడగొట్టినందుకే మీకు ఉద్యోగాలు వచ్చాయంటూ నూతనంగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులనుద్దేశించి వ్యాఖ్యానించారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి.. వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కోరి.. రెండుసార్లు కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నామని, మళ్లీ అలాంటిది జరగదని అన్నారు.


డీఎస్సీ నోటిఫికేషన్‌ను అడ్డుకోవడానికీ కొన్ని కొరివి దెయ్యాలు ప్రయత్నించాయని, కేసులు వేసి కుట్రలు చేశాయని ఆరోపించారు. గత ప్రభుత్వ నిరుద్యోగుల గురించి, పేదల గురించి ఆలోచించలేదని, కానీ.. తన కూతురు కవిత ఎంపీగా ఓడిపోగానే కేసీఆర్‌ ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన మూడేళ్ల తరువాత డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారని, ఆ తరువాత రెండేళ్లకు నియామక ప్రక్రియ పూర్తి చేశారని అన్నారు. తాము మాత్రం పేదల మేలుకోసం విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెడుతూ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల కొలువులు భర్తీ చేసి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. 65 రోజుల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేశామన్నారు.


  • దసరా పండుగ ముందే వచ్చినట్లు ఉంది..

డీఎస్సీ విజేతలను చూేస్త దసరా పండుగ ముందే వచ్చినట్లు అనిపిస్తోందని సీఎం రేవంత్‌ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్లే కీలకమని, తెలంగాణ వారధులు, నిర్మాతలు వారేనని, పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత వారిపైనే ఉందని పేర్కొన్నారు. నిరుపేదలు బంగారం అమ్మి ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని పంపే పరిస్థితి మారాలని, కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులే ఈ పరిస్థితికి కారణాలను అన్వేషించాలని సూచించారు. ‘‘నేను ప్రభుత్వ బడిలోనే చదువుకున్నా. ముఖ్యమంత్రిని అయ్యాను. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, కేశవరావు, కోదండరాం వంటి ఎందరో పెద్దలు ప్రభుత్వ బడిలోనే చదివారు.


అబ్దుల్‌ కలాం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే రాష్ట్రపతి అయ్యారు. మీలాంటి టీచర్లు చెప్పిన చదువుతోనే ఈ స్థాయికి వచ్చాం. జాతి నిర్మాతలను తీర్చిదిద్దిన క్షేత్రం ప్రభుత్వ బడి’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. తెలంగాణలో 30 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.. వాటిలో 24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ప్రైవేటు యాజమాన్యంలో 10 వేల పాఠశాలలు ఉంటే.. వాటిలో మాత్రం 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. ‘‘ప్రైవేటు స్కూళ్లలో మీకంటే ఎక్కువ చదువుకున్నవారు, మీకన్నా గొప్ప వ్యక్తులు, అనుభవం ఉన్నవారు బోధిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.


  • పుస్తెలు అమ్మి ప్రైవేటు స్కూల్‌కు పంపుతున్నారు..

గ్రామాల్లో సైతం ప్రభుత్వ బడికి వెళ్లడమంటే నామోషీగా భావిస్తున్నారని సీఎం రేవంత్‌ తప్పుబట్టారు. ఉపాధి హామీ కూలికి పోయినవారు కూడా తాము తిన్నా, తినకపోయినా.. పుస్తెలు అమ్మి అయినా తమ పిల్లలను ప్రైవేటు స్కూల్‌కు పంపాలనుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొన్నదో టీచర్లు ఆలోచించాలన్నారు. ‘‘అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభిస్తున్నాం. ఈ నెల 11న దీనికి శ్రీకారం చుడుతున్నాం. విద్యకు బడ్జెట్‌లో రూ.21 వేల కోట్లు కేటాయించాం. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునికీకరిస్తున్నాం. విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి.. ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తాం’’ అని సీఎం అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీని ప్రారభించామని, వారికి గల్ఫ్‌, మిడిల్‌ ఈస్ట్‌ వంటి దేశాల్లో ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఒలింపిక్స్‌ వేదికల్లో దేశం పరిస్థితి ఏంటో చూశామని, నాలుగు కోట్లు జనాభా ఉన్న దక్షిణ కొరియాకు ఒలింపిక్స్‌లో 32 పతకాలు వస్తే.. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఎందుకు అన్ని పతకాలు రాలేదని సీఎం ప్రశ్నించారు. యువత మత్తుకు, వ్యసనాలకు బానిసలై.. తప్పుదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు బంగారు పతకాలు రావాలని ఆకాంక్షించారు.


  • జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం..

దేశంలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ముందుకే పోతామన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ సమాజాన్ని నిలబెట్టడానికి అందరం కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ సింఘ్వీ, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు.


నా మనుమరాలు పెళ్లికి రండి..!

సీఎంను కలిసి ఆహ్వానించిన మల్లారెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బుధవారం ఆయన నివాసంలో కలిశారు. తన మనవరాలు పెళ్లికి రావాలంటూ ఆయన్ను ఆహ్వానించారు. మల్లారెడ్డి వెంట ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 04:07 AM