CM Revanth Reddy: 10 రోజులు.. 52 సమావేశాలు!
ABN , Publish Date - Aug 03 , 2024 | 02:59 AM
రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.
10 రోజులు.. 52 సమావేశాలు!.. ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ
50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితోనూ చర్చలు
నేటి నుంచి సీఎం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన
నేటి నుంచి సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా, దక్షిణ కొరియా పర్యటన
ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ
50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితోనూ చర్చలు
మూసీ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని కోరనున్న సీఎం..
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్తున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరనున్న సీఎం.. అక్కడ ఆరు రోజుల పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు వెళ్తారు. ఈ పది రోజుల పాటు పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో కంపెనీల అధిపతులతో సీఎం నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ఇందులో అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ సీఈవో, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సీవోవో, పెప్సీ కో సీనియర్ మేనేజ్‌మెంట్, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దిగ్గజాలున్నారు. 6న వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితోనూ సీఎం భేటీ కానున్నారు. మూసీ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల గురించి ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు.
ఈ ప్రాజెక్టుల్లో ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం కావాలని, ఆర్థిక సాయం చేయాలని కోరే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే స్టాన్‌ఫోర్డ్ యునివర్సిటీని సీఎం సందర్శించనున్నారు. స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంపైనా అక్కడి డీన్‌తో మాట్లాడనున్నారు. అనంతరం శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జిని సందర్శించనున్నారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టబోయే అంశాలను అక్కడ పరిశీలించనున్నారు. ఇక దక్షిణ కొరియా పర్యటనలో టెక్స్‌టైల్ దిగ్గజ కంపెనీలతో సీఎం సమావేశం కానున్నారు. ఇందులో ఇప్పటికే వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో భారీ పెట్టుబడులు పెట్టిన యంగ్‌వన్ కార్పొరేషన్ కూడా ఉంది. 10 రోజుల పర్యటన అనంతరం సీఎం నేతృత్వంలోని బృందం ఈనెల 14న ఉదయం హైదరాబాద్ చేరుకోనుంది.