TSRTC Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో 3,035ఉద్యోగాల భర్తీకి సీఎం పచ్చజెండా..
ABN , Publish Date - Jul 02 , 2024 | 07:57 PM
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు చెప్పారు. టీఎస్ఆర్టీసీ(TSRTC)లో 3,035ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. 2014తర్వాత మొదటిసారి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీపి కబురు చెప్పారు. టీఎస్ఆర్టీసీ (TSRTC)లో 3,035ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వెల్లడించారు. 2014తర్వాత మొదటిసారి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. డ్రైవర్లు, శ్రామిక్, మెకానిక్ ఇలా 3,035ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రానుందన్నారు.
ఇప్పటికే కారుణ్య నియామకాల కింద వెయ్యికి పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే భారీగా కొత్త బస్సులు కొనుగోలు చేశామని, నూతనంగా మరో 2వేలకు పైగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. 33జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ప్రతి మండల కేంద్రం నుంచీ హైదరాబాద్‌కు బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.."తెలంగాణలోని అన్ని గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ చేయాలని భావిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేశాం. దీంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. 100శాతం ఆక్యుపెన్సీ దాటింది. కొత్త బస్సుల కొనుగోలుపై ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రోజున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగుల శ్రమ ప్రభుత్వ సహకారంతోనే సంస్థ ముందుకు పోతోంది. మహిళల రాయితీ ప్రభుత్వం చెల్లించడం వల్ల ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడుతోంది. గతంలో తీసుకున్న బకాయిలు, పీఎఫ్, కోఆపరేటివ్ సెస్, బ్యాంకు అప్పులు తీర్చడానికి పనిచేస్తున్నాం.
ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటాం..
2013 పెండింగ్ ఏరియల్స్ రూ.280కోట్ల బకాయిలు పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే రూ.80కోట్లు చెల్లించాం. రూ.200కోట్లు ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆలస్యమైనా ప్రతి కార్మికుడికీ చెల్లిస్తాం. ఉద్యోగులకు 21శాతం పీఆర్సీ అమలు చేశాం. ఆర్టీసీ తార్నాక హాస్పిటల్‌ను సూపర్ స్పెషాలిటీగా మారుస్తున్నాం. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సతోపాటు అధునాతన చికిత్స అందిస్తున్నాం. దేశంలోనే ఆర్టీసీ అగ్రగామిగా నిలిచేలా ప్రయత్నిస్తున్నాం. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన బస్టాండుల మరమ్మతులు చేయిస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా పారదర్శకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తాం. ఉద్యోగాల భర్తీ కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా" అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.