Share News

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే!

ABN , Publish Date - Nov 09 , 2024 | 03:49 AM

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసేవారు కుక్కచావు చస్తారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతామని ప్రకటించారు.

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే  కుక్కచావే!

  • బుల్డోజర్లు ఎక్కించైనా మూసీ ప్రక్షాళన చేపడతాం

  • మూసీ కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదం

  • ప్రక్షాళన చేయకపోతే నా జన్మ దండగ

  • నకిలీ బీజేపీ నేతలవి అవాకులు.. చవాకులు

  • మోదీ చేస్తే మెచ్చుకుంటారు.. మేం చేస్తే తప్పా?

  • బిడ్డ జైలుకెళ్తే దుఃఖించావు.. మా బిడ్డల బాధలు పట్టవా కేసీఆర్‌?.. ఈ పాదయాత్ర ట్రైలరే

  • అసలు సినిమా ముందుంది: సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సంగెంలో మూసీ బాట

యాదాద్రి/చౌటుప్పల్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసేవారు కుక్కచావు చస్తారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతామని ప్రకటించారు. మూసీ కాలుష్యం వల్ల ఆ నది పరీవాహక ప్రాంత ప్రజలు అణుబాంబుతో కలిగే ప్రమాదం కంటే ఎక్కువ దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరంగా ఉండాల్సిన మూసీ.. శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవంతోనే వారికి ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ పునరుజ్జీవ యాత్రను సీఎం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గంగా, సబర్మతి నదులను రూ.40 వేల కోట్లతో సుందరీకరణ చేసుకుంటే, తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా మూసీ పునరుజ్జీవం చేయొద్దా? అని ప్రశ్నించారు. ప్రధాని చేసిన పనిని మెచ్చుకుంటూ.. మూసీ ప్రక్షాళనపై నకిలీ బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్‌ఎస్‌ అంటోందని, ఈ మూసీ ప్రక్షాళన చేయకపోతే తన జన్మ దండగ అని భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపట్టి.. రూ.25 వేల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు.


మీలాగా కాళేశ్వరం నిర్మించి రూ.లక్ష కోట్లు దోచుకోలేదు. డబ్బులు సంపాదించాలనుకుంటే కేసీఆర్‌ తెచ్చిన ధరణితో కోకాపేటలో 500 ఎకరాల్లో తప్పిదాలు చేస్తే.. రూ.50 వేల కోట్లు వస్తాయి. రంగారెడ్డి, హైదరాబాద్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజల ప్రయోజనాల కోసం మూసీ ప్రక్షాళనకు పూనుకున్నాం. బీఆర్‌ఎ్‌సకు దోచుకోవడం తప్ప మేలు చేయడం తెలియదు. అందుకే మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు’’ అని సీఎం రేవంత్‌ ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటానని చెప్పిన కమ్యూనిస్టు సోదరులకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఒకనాడు మంచినీటిని అందించిన మూసీనది ప్రస్తుతం మురికికూపంగా మారి విషాన్ని చిమ్ముతోందని సీఎం రేవంత్‌ అన్నారు. పాలకులు పగబట్టారా? దేవుడు శాపం పెట్టాడా? అన్న పరిస్థితితో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదని, ఇక్కడ పండిన పంటలు తినేలా లేవని, ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ప్రస్తుతం భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ‘‘3నెలలపాటు మీ కుమార్తె జైలుకు పోతేనే దుఃఖం వచ్చింది. మూసీ పరివాహక ప్రాంత బిడ్డల జీవితాలు పోతుంటే మీకు పట్టదా? మా బిడ్డలు కాళ్లు, నడుము వంకర్లతో పుడితే వాళ్లను ఇంట్లోనే ఉంచి తల్లులు పనికి వెళ్తున్నారు. ఆ బిడ్డల బాధ పట్టదా? నల్లగొండ జిల్లా ప్రజలు మీకు ఓట్లు వేయలేదని మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నావా కేసీఆర్‌? నల్లగొండ పౌరుషాల గడ్డ. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు’’ అని రేవంత్‌ అన్నారు.


  • జన్మ ధన్యమైంది..

‘‘ఇది జన్మదినం కాదు.. ఇక్కడికి రావడంతో నా జన్మ ధన్యమైంది. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నాను. మూసీ ప్రక్షాళన చేసి తీరతాం. నేటి పాదయాత్ర ట్రైలర్‌ మాత్రమే.. అసలు సినిమా 2025 జనవరిలో ఉంది. వాడపల్లి నుంచి హైదరాబాద్‌ చార్మినార్‌ వరకు లక్షలాది మందితో కదం తొక్కుతాం. బిల్లా, రంగా (కేటీఆర్‌, హరీశ్‌రావు)లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాతోపాటు పాదయాత్ర చేపట్టాలి.. ఈ ప్రాంతానికి రావాలి. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని రానిస్తారో, నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం’’ అంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.2 కోట్లతో భీమలింగం శివన్న దర్శనానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కోటి మంది ప్రజలకు ఇబ్బందిగా మారిన మూసీ ప్రక్షాళనకు పార్టీలు రాజకీయాలకతీతంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళన చేపడితే బుల్డోజర్లకు అడ్డంగా పడుకొని ఆపుతామని కేటీఆర్‌, హరీశ్‌రావు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎవరు అడ్డొచ్చినా బుల్డోజర్లతో తొక్కుకుంటూ మూసీ ప్రక్షాళనను ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. తనను జైలులో పెడితే యోగా చేసి స్లిమ్‌గా తయారై బయటికి వస్తానంటూ కేటీఆర్‌ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.


  • సీఎం యాత్ర సాగిందిలా..

సీఎం రేవంత్‌రెడ్డి.. మూసీ పునరుజ్జీవ పాదయాత్రను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం బ్రిడ్జి వద్ద చేపట్టారు. సాయంత్రం 3.30 గంటలకు సంగెం వద్దకు చేరుకున్న సీఎం.. తొలుత మూసీనది ఒడ్డున ఉన్న భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. శివలింగాన్ని గుండెలకు హత్తుకున్నారు. అక్కడే ప్రజాప్రతినిధులు, అధికారులతో భీమలింగం అభివృద్ధికి సంబంధించి చర్చించారు. అనంతరం ఎన్‌డీఆర్‌ఐ బృందానికి చెందిన బోటు ఎక్కి మూసీలో కొద్దిదూరం ప్రయాణించి నదిలోని నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడారు. మూసీ కాలుష్యం కారణంగా కులవృత్తులవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో చర్చించారు. కాగా, ఈ ప్రాంతంలో పండిన పంటలను కొనుగోలు చేయడంలేదని రైతులు సీఎంతో చెప్పారు. మూసీ ప్రక్షాళనతోనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. 4.09 నిమిషాలకు సీఎం రేవంత్‌రెడ్డి భీమలింగం కత్వ నుంచి మూసీ పునరుజ్జీవ యాత్ర చేపట్టారు. యాత్ర రెండున్నర కిలోమీటర్లు కొనసాగి 4.43 గంటలకు ముగిసింది. యాత్ర ముగిసిన ప్రదేశంలోనే ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి ప్రత్యేక రథం ఎక్కి మాట్లాడారు.


  • బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల అరెస్టు

నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించడంతో శుక్రవారం నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని ఆయన నివాసంలో హౌస్‌ అరెస్టు చేశారు. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద అరెస్టుచేసి మునుగోడు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు.

Updated Date - Nov 09 , 2024 | 03:49 AM