Share News

CM Revanth Reddy: మూడు రంగుల జెండా పట్టి..

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:46 AM

మున్ముందు పోరు బీఆర్‌ఎ్‌స-బీజేపీ మధ్యే అని.. కాంగ్రెస్‌ కనీసం పోటీ కూడా ఇస్తుందా? అని అనుకుంటున్న స్థితిలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి..

CM Revanth Reddy: మూడు రంగుల జెండా పట్టి..

  • టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ చెరగని ముద్ర

హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మున్ముందు పోరు బీఆర్‌ఎ్‌స-బీజేపీ మధ్యే అని.. కాంగ్రెస్‌ కనీసం పోటీ కూడా ఇస్తుందా? అని అనుకుంటున్న స్థితిలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి.. తనదైన శైలిలో పార్టీని ముందుకు నడిపించి అధికారంలోకి తెచ్చారు. రేవంత్‌ 38నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు మహేశ్‌ కుమర్‌గౌడ్‌ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగా 2021 జూలై 7న బాధ్యతలు స్వీకరించే నాటికి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2018లో 19 స్థానాల్లో గెలిస్తే 13 మందిని బీఆర్‌ఎస్‌ లాగేసింది.


రేవంత్‌ పగ్గాలు స్వీకరించే నాటికి పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు ఆరుగురే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థాయి నుంచి పార్టీని రేవంత్‌ ముందుకు నడిపించి తిరుగులేని విజయాన్ని అందించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగిందంటే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ చేసిన అవిశ్రాంత పోరే కారణమనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మూడు రంగుల జెండా పట్టి.. సింగమోలె కదిలినాడు.. ఒక్కరూ కాంగ్రెస్‌ సూరీడు.. అంటూ రేవంత్‌పై వచ్చిన పాట ఎన్నికల్లో ఎంత సంచలనం సృష్టిందో, పీసీసీ అధ్యక్షుడిగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ సంచలనం సృష్టించారు. ఒకవైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌తో బీఆర్‌ఎస్‌.. గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ సవాల్‌ విసురుతున్న తరుణంలో ఆయన గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరిస్తూనే కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని ప్రకటించారు.


రేవంత్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ 3,014 (1.5 శాతం)ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఇక కాంగ్రెస్‌ ఖతం అనుకున్నారు అంతా. అంతలోనే మునుగోడు ఉప ఎన్నిక.. అదే సమయంలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ పరిస్థితుల్లో అటు మునుగోడు ఉప ఎన్నిక, భారత్‌ జోడో యాత్రను రెండింటినీ సమన్వయం చేసుకొని రేవంత్‌ ముందుకెళ్లారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీనే.. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో బలపడింది. ఈ పరిస్థితుల్లో.. పార్టీ శ్రేణులను ఐక్యం చేసి రాష్ట్ర కాంగ్రె్‌సలో రేవంత్‌ నూతన ఉత్సాహాన్ని నింపారు.


దళిత గిరిజన దండోరా, నిరుద్యోగ గర్జన, రైతు సంఘర్షణ సభ వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో 2023 ఫిబ్రవరి నుంచి 33 రోజులపాటు చేపట్టిన యాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. రైతులు, దళిత, గిరిజన, బీసీ, యువత, విద్యార్థులు, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్‌ చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలను డిక్లరేషన్ల రూపంలో అగ్రనేతలు సోనియా, రాహుల్‌తో విడుదల చేయించారు. ఇవన్నీ ఆయావర్గాల్లో కాంగ్రెస్‌ పట్ల నమ్మకాన్ని పెంచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాలు సాధించడం వెనక రేవంత్‌ రెడ్డి పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. ఇక, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటూ రానివ్వమన్న సవాల్‌ను రేవంత్‌ నిలబెట్టుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ను ప్రతిపక్ష నాయకుడి పాత్రకే పరిమితం చేశారు.

Updated Date - Sep 16 , 2024 | 08:39 AM