Kodangal: నాయకుల మృతి పార్టీకి తీరని లోటు
ABN , Publish Date - Oct 27 , 2024 | 03:58 AM
కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించిన నాయకుల అకాల మృతి బాధాకరమని, వారు లేకపోవడం పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్ అన్నారు.
నాయకుల మృతి పార్టీకి తీరని లోటు వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కొడంగల్, మద్దూర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించిన నాయకుల అకాల మృతి బాధాకరమని, వారు లేకపోవడం పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్ అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలో మద్దూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు కల్లప్ సతీశ్, బొంరాస్‌పేట్ మండలంలోని రేగడిమైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నర్సిరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ శనివారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి వారి కుటుంబాలను పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మద్దూర్‌కు చేరుకున్న సీఎం రేవంత్ మొదట సతీశ్‌కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి బొంరాస్‌పేట్ మండలం రేగడిమైలారానికి రోడ్డు మార్గంలో చేరుకుని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు నర్సిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సిరెడ్డి భార్య యాదమ్మను, కుటుంబసభ్యులను ఓదార్చారు.