తెలంగాణ తల్లి విగ్రహాన్ని పదేళ్లలో పెట్టలేదేం?
ABN , Publish Date - Aug 21 , 2024 | 02:21 AM
రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ.. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
సచివాలయం ఎదుట ఎందుకు ఏర్పాటు చేయలేదు?
డిసెంబరు 9న సచివాలయంలో మేం పెడతాం
దీనిపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు
అధికారం కోల్పోయినా బలుపు తగ్గలేదు
రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానంటావా?
టచ్ చేసి చూడు.. వీపు చింతపండే
రాజీవ్‌గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్
కేటీఆర్‌పై పోలీసులకు ఎంపీ అనిల్ ఫిర్యాదు
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన
సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబరు 9న ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. మంగళవారం అందుకు సంబంధించిన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు స్థలం, డిజైన్‌పై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలన్నారు.
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ.. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రదేశంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే.. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
ఈ విషయంపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తమ ప్రభుత్వమే సచివాలయంలో ఏర్పాటు చేస్తుందనిప్రకటించారు. మంగళవారం రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆధ్వర్యంలో ‘రాజీవ్ సద్భావన రన్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘ఒకాయన మళ్లీ అధికారంలోకి వస్తే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానంటున్నడు! ఎవడైనా చేతనైతే వచ్చి విగ్రహం మీద చెయ్యి వేయండి.. వీపు చింతపండు అవుతుంది.
అధికారం పోయినా.. బలుపు తగ్గలేదు. నీ బలుపును కాంగ్రెస్ కార్యకర్తలు అణగదీస్తరు. అక్కడ మీ నాయన విగ్రహం పెట్టాలని దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తీస్తావా? కలలో కూడా నీకు అధికారం రాదు’’ అని కేటీఆర్‌నుద్దేశించి సీఎం రేవంత్ అన్నారు. కేటీఆర్‌కు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు.
యువతకు స్ఫూర్తి రాజీవ్‌గాంధీ..
రాజీవ్‌గాంధీ దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నేత అని, యువతకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ అన్నారు. కంప్యూటర్ విప్లవంతో కోట్లాది మందికి ఉపాది అవకాశాలు వస్తాయని 19వ దశకంలోనే కంప్యూటర్‌ను, సాంకేతిక నైపుణ్యాన్ని, టెలికం రంగాన్ని పరిచయం చేసిన స్ఫూర్తిదాత అని కొనియాడారు. రాజీవ్ కుటుంబం దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి, దేశం కోసం రెండు తరాలు ప్రాణాలిచ్చిన కుటుంబమని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబమని అన్నారు.
సచివాలయం ముందు కోట్లాది మందికి స్ఫూర్తిగా అమరవీరుల విగ్రహం పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సముచితమన్నారు. త్వరలోనే పండుగ వాతావరణంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘‘ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని, రూ.వేల కోట్లు సంపాదించుకొని, వందలాది ఎకరాల్లో ఫాంహౌస్‌లు కట్టుకున్నవారి విగ్రహం సచివాలయం ముందు పెడతారా?’’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ నాయకులు అధికారం కోల్పోయిన అసహనంతో విచక్షణా రహితంగా మాట్లాడితే తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశం ప్రభావం చూపలేకపోయిందని, దక్షిణ కొరియా లాంటి చిన్న దేశానికి 32 పతకాలు వచ్చాయని సీఎం రేవంత్ అన్నారు. దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీలాగే యంగ్ ఇండియా స్పోర్స్ట్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తామని తెలిపారు.
4గోడల మధ్యకూర్చుంటే పెట్టుబడులు రావు
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. కానీ, ఒకాయన ఇక్కడ కూర్చొని ఏదో కంపెనీతో ఎంవోయూ చేసుకొని వచ్చారంటున్నారని విమర్శించారు. ‘‘మీలాగా నాలుగు గోడల మధ్య కూర్చుంటే పెట్టుబడులు రావు. కంపెనీలతో ఎంవోయూలు చేసుకుంటేనే పెట్టుబడులు వస్తాయి. మీకు, మాకు తేడా ఇదే’’ అని డిప్యూటీ సీఎం అన్నారు.
చెరువులు, కుంటల్లో ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రాను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇచ్చామని తెలిపారు. రూ.31 వేల కోట్లతో రైతు రుణమాఫీ ప్రక్రియను చేపట్టామని పేర్కొన్నారు. పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయనివారు.. పది రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పిన ప్రతీ గ్యారంటీని అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌పై అనిల్‌కుమార్‌యాదవ్ ఫిర్యాదు
బంజారాహిల్స్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రిని ‘చీప్ మినిస్టర్’ అని సంబోధిస్తూ ‘ఎక్స్’లో కేటీఆర్ పోస్టు చేశారని, అంతేకాకుండా ‘ఢిల్లీ గులామ్’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సైఫాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనిల్‌కుమార్ యాదవ్ కోరారు.