Congress: మహారాష్ట్రలో తెలంగాణ ‘హస్తం’
ABN , Publish Date - Nov 16 , 2024 | 03:32 AM
మహారాష్ట్ర! మన సరిహద్దు రాష్ట్రం.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ మూలాలున్న వారు ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఎన్నో...! దీంతో ఏఐసీసీ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది.
అక్కడ ప్రచారంలో రాష్ట్ర నేతల బిజీ
శని, ఆదివారాల్లో రేవంత్ ప్రచారం
80కి పైగా నియోజకవర్గాలలో పరిశీలకులుగా ఉత్తమ్, సీతక్క
హైదరాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర! మన సరిహద్దు రాష్ట్రం.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ మూలాలున్న వారు ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఎన్నో...! దీంతో ఏఐసీసీ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. స్టార్ క్యాంపెయినర్‌గా నియమతులైన సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే రెండు సార్లు మహారాష్ట్ర వెళ్లివచ్చారు. ఇప్పుడు మరోమారు శని, ఆదివారాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాజూరా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్‌షోలు, ప్రచార సభల్లో పాల్గొని తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు. రెండోరోజు ఆదివారం నాగ్‌పూర్ నుంచి నాందేడ్ చేరుకుంటారు. తెలుగు వారు ఎక్కువగా ఉండే నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక, ఉత్తర మహారాష్ట్రలోని 40 నియోజకవర్గాలకు మంత్రి సీతక్కను, మరాఠ్వాడ పరిధిలోని 48 నియోజకవర్గాలకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని సీనియర్ పరిశీలకులుగా ఏఐసీసీ నియమించింది.
దీంతో ఉత్తమ్, సీతక్క ఆయా నియోజకవర్గాల నేతలతో నిరంతరం సమీక్షలు జరపుతూ, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతూ వస్తున్నారు. సీతక్కకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఎస్టీ రిజర్వుడు 12 నియోజకవర్గాలు ఉండడంతో వాటిపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి కూడా ప్రచారం, ఇతర కార్యాక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత కోట నీలిమ తదితరులకు లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఆయా నియోజకవర్గాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్యయ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూధన్‌రెడ్డి, పార్టీ నేతలు రాచమళ్ల సిద్దేశ్వర్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, అన్వే్‌షరెడ్డి, కత్తి వెంకటస్వామి తదితరులకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు కేటాయించారు. ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు.