Share News

Khammam: నేడు సీతారామ ఎత్తిపోతల గలగల

ABN , Publish Date - Aug 15 , 2024 | 02:24 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన 3 పంప్‌హౌ్‌సలను ప్రారంభించనున్నారు.

Khammam: నేడు సీతారామ ఎత్తిపోతల గలగల

  • ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

  • బీఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలను పట్టించుకోబోం: తుమ్మల

ఖమ్మం, వైరా, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన 3 పంప్‌హౌ్‌సలను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌ గురువారం ఉదయం 11:45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి మధ్యాహ్నం 12-50గంటలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పంప్‌హౌ్‌స-2ను ప్రారంభించి.. గోదావరి జలాలను విడుదల చేస్తారు.


అనంతరం మధ్యాహ్నం 2-45 గంటలకు వైరా బయలుదేరుతారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో చివరి విడత రూ.2 లక్షల రైతు రుణమాఫీ నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూసుగూడెం, వైరా పర్యటన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మి దినెలలు పూర్తికాకముందే రైతు రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. కనీసం బిడ్డ పుట్టడానికైనా తొమ్మిదినెలల సమయం పడుతుందని, అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కూడా కాకముందే బీఆర్‌ఎస్‌ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలను తాము పట్టించుకోబోమన్నారు.


  • రేవంత్‌కు ఘనస్వాగతం

శంషాబాద్‌ రూరల్‌ : అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించి తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. విదేశాలకు వెళ్లి వచ్చిన సీఎం రేవంత్‌కు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్యల బుధవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలు కప్పి స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రేవంత్‌.. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌లో వెళ్లారు.

Updated Date - Aug 15 , 2024 | 02:24 AM