Share News

CM Revanth Reddy: చారిత్రక భవనాలకు పర్యాటక కళ..

ABN , Publish Date - Sep 28 , 2024 | 03:29 AM

మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: చారిత్రక భవనాలకు పర్యాటక కళ..

  • జూబ్లీహాల్‌, ఉస్మానియా, హైకోర్టు, సిటీ కాలేజీ నిర్మాణాల పరిరక్షణకు చర్యలు

  • విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని

  • సంక్షేమంతో పాటు పర్యాటకంపైనా ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతోపాటు పర్యాటక రంగాన్నీ ముందుకు తీసుకెళతామని తెలిపారు. హైదరాబాద్‌లోని పలు పురాతన, మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటకశాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు.


గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసన మండలిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీహాల్‌ను ప్రత్యేక టెక్నాలజీతో నిర్మించారని, చారిత్రక ప్రాధాన్యం ఉన్న భవనాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జూబ్లీ హాల్‌ను దత్తత తీసుకొని పరిరక్షించాలని సీఐఐకి సూచించారు. ఇప్పటికే చార్మినార్‌ పరిరక్షణ ప్రాజెక్టు కొనసాగుతోందని, హైకోర్టు, సిటీ కాలేజీ, పురానాపూల్‌ బ్రిడ్జి, ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం వంటి కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరముందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకోసమే తెలంగాణ దర్శిని తీసుకువచ్చామన్నారు.


  • పురాతన బావులను దత్తత తీసుకున్న సంస్థలు

నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్థరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చారు. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా వర్సిటీలోని మహాలఖాబాయి మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్పోసిస్‌ ఒప్పందం చేసుకుంది. మంచిరేవుల మెట్ల బావిని సాయిలైఫ్‌ సంస్థ దత్తత తీసుకుంది. భారత్‌ బయోటెక్‌ సంస్థ సాలార్‌ జంగ్‌, అమ్మపల్లి బావులను పునరుద్ధరించనుంది. అడిక్‌మెట్‌ మెట్ల బావిని దొడ్ల డెయిరీ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్‌ కాలేజీ పునరుద్ధరించనున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీప్రసాద్‌, సీఐఐ తెలంగాణ చైర్మన్‌ సాయి ప్రసాద్‌ పాల్గొన్నారు.


  • స్కూళ్లలో అల్పాహారానికి రూ.6.4కోట్లు

వరంగల్‌ కల్చరల్‌/కొడంగల్‌: పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా కొడంగల్‌ పరిధిలోని 312పాఠశాలల్లో 28వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, సంబంధిత ఖర్చును భరించేందుకు వియాట్రీస్‌ సంస్థ, హెచ్‌కేఎం చారిటబుల్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చాయి. ఈ మేరకు వియాట్రిస్‌ సీఎ్‌సఆర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ హెడ్‌ మిషెల్‌ డొమినికా, చారిటబుల్‌ ఫౌండేషన్‌ సీఈవో కౌంతేయదాస సంబంధిత ఎంవోయూపై సంతకాలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రూ.6.4కోట్ల చెక్కును అందజేశారు. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. కాగా, వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో అక్టోబరు 3 నుంచి 12వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఉత్సవాలకు రావాలని సీఎంను వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆహ్వానించారు.

Updated Date - Sep 28 , 2024 | 03:29 AM