Cold Wave: పెరుగుతున్న చలి తీవ్రత
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:56 AM
రాష్ట్రంలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి ప్రభావం ఎక్కువవుతోంది.
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్, నవంబరు 18: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి ప్రభావం ఎక్కువవుతోంది. సోమవారం సైతం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 12.0డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాకు చెందిన సిర్పూర్(యు)లో 12.3, వాంకిడిలో 12.9డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12- 13డిగ్రీల లోపే నమోదు కావడం గమనార్హం.
రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో సైతం ఉష్ణోగ్రతలు 13-15డిగ్రీల స్థాయికి పడిపోయాయి. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిల్లో వరుసగా రెండోరోజు 12.2డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో 12.6డిగ్రీలు నమోదు కావడం విశేషం.