Land Market Value: స్థానిక ఎన్నికల తర్వాతనా.. ముందుగానా?
ABN , Publish Date - Oct 05 , 2024 | 03:19 AM
భూముల మార్కెట్ విలువల పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మూడు నెలల స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక విలువలను పెంచితే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు.
మార్కెట్ విలువల పెంపుపై తర్జనభర్జనలు
ప్రైవేటు ఏజెన్సీ నివేదిక కోసం ఎదురుచూపులు
బదిలీలు, సంస్థాగత మార్పులపై సమీక్ష
హైదరాబాద్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): భూముల మార్కెట్ విలువల పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మూడు నెలల స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక విలువలను పెంచితే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారుల సమీక్షలో.. మార్కెట్ విలువల పెంపుపైనే చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే విలువల పునశ్చరణ కమిటీల నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. దీనిపై లోతుగా పరిశీలనకు తమిళనాడు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏజెన్సీ నియామకం, దాని నివేదిక ఎలా ఉండనుందనే విషయమూ అధికారుల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కాగా, నవంబరు నుంచి కొత్త విలువలను అమల్లోకి తేవాలని ఇటీవల మంత్రి పొంగులేటి సూచించారు.
ఇలా చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. తమిళనాడు ఏజెన్సీ నివేదిక ఆధారంగా విలువల సవరణలో మార్పులు చేయాలనేది సర్కారు ఉద్దేశం. కాగా, విమర్శలకు తావు లేకుండా బదిలీలు చేయడంపై రిజిస్ట్రేషన్ శాఖ కమిషర్, ఐజీ జ్యోతిబుద్ధప్రకాశ్ ఉన్నతాధికారుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం సమావేశంలో దీనిపైనా సుదీర్ఘంగా చర్చించారు. 30 కీలకమైన కార్యాలయాలపై ఆరోపణలు రావడంతో అక్కడివారందరిని కదిలించాలా లేక కొంతమందినేనా? అనేదానిపై చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇకపై బదిలీల్లో తమను భాగస్వాములను చేయొద్దని కొందరు అధికారులు కమిషనర్, ఐజీకి తేల్చి చెప్పారు. కాగా, గొంతు పిసుకుతా.. తప్పు చేస్తే నరికేస్తా అంటూ ప్రజ్రాతినిధులు బెదిరిస్తున్నారని, ఇలాంటి వాతావరణంలో పనిచేయలేమంటూ కొందరు అధికారులు కమిషనర్ వద్ద వాపోయినట్లు సమాచారం.