Congress: రేవంత్ సీఎం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. సబితపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 31 , 2024 | 07:43 PM
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ.. సబిత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆదరించి చేరదీసిందని అన్నారు.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ.. సబిత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆదరించి చేరదీసిందని అన్నారు. అలాంటి పార్టీని మోసం చేసి మంత్రి పదవి కోసం బీఆర్ఎస్‌లో చేరారని విమర్శించారు.
"సబితా ఇంద్రారెడ్డి ఏ దిక్కూ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదరించింది. ఆమెతో కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. భర్త చనిపోతే సబితకి పిలిచి టికెట్ ఇచ్చి, మంత్రిని చేశారు. దళిత నాయకుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడు అయితే తట్టుకోలేకే సబిత పార్టీ మారారు. మహిళలను సీఎం రేవంత్ అవమానించారని సబిత అంటున్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది. మహిళలను ముఖ్యమంత్రులు, మంత్రులుగా చేసిందే కాంగ్రెస్ పార్టీ. పార్టీ వల్ల ఎదిగి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న సబిత తీరును చూస్తుంటే చప్పట్లు కొడుతూ రన్నింగ్ కామెంటరీ చేసినట్లు ఉంది.
రేవంత్ రైతు కుటుంబం నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన చరిత్ర నుంచి అనుభవాలు నేర్చుకుంటూ ఎదిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి తెలివి ఉంటే ఈ విషయాలు అర్థమయ్యేవి. ఆయన అసెంబ్లీలో పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ మాజీ సీఎం జగన్ లాంటి చాలామంది.. మంత్రులు కాకుండానే ముఖ్యమంత్రులు అయ్యారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్ల కేటీఆర్ మంత్రికాగలిగారు. రేవంత్ కింది స్థాయి నుంచి కష్టపడి సీఎం పదవి చేపట్టారు" అని సత్యనారాయణ పేర్కొన్నారు.
మహిళలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్..
మహిళలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు. సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. సబిత ఇంద్రారెడ్డిని సభలో అగౌరవపరిచామని బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందని అన్నారు.
"కేసీఆర్ సభకు వస్తే ఆయన్ని ప్రశ్నించాలని అనుకున్నా. ఆ పార్టీలో అప్పుడైనా ఇప్పుడైనా మాట్లాడేది కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత మాత్రమే. బీఆర్ఎస్‌లో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. సభ అద్భుతంగా జరుగుతుందని మేధావులు అంటున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం సభ మర్యాదను గంగలో కలుపుతున్నారు. సభా నాయకుడిని ఏకవచనంతో సంబోధించడం ఏం పద్ధతి?. సబితకి కాంగ్రెస్ ఎంత గౌరవం ఇచ్చిందో అందరికీ తెలుసు. ఆమె కాంగ్రెస్ పార్టీని వదిలిపోయిందనే బాధ తప్పా ఆమెపై అగౌరవం లేదు. ఆమెను అగౌరవపరిచామని బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు క్యాబినెట్లో చోటే ఇవ్వలేదు" అని రాజ్ ఠాకూర్ అన్నారు.
For Latest News and National News click here