Share News

Mahesh Kumar Goud: విధ్వంసాన్ని సరిచేస్తూ.. వికాసం వైపు

ABN , Publish Date - Dec 08 , 2024 | 04:31 AM

బీఆర్‌ఎస్‌ పదేళ్ల విధ్వంస పాలనలో అస్తవ్యస్తంగా మారిన తెలంగాణను కాంగ్రెస్‌ సర్కారు సరిచేస్తూ వికాసం వైపు పరుగులు తీయిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

Mahesh Kumar Goud: విధ్వంసాన్ని సరిచేస్తూ.. వికాసం వైపు

  • ప్రజా సొమ్మును కాజేసిన చరిత్ర కేసీఆర్‌ కుటుంబానిది

  • తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం వద్దు

  • రేవంత్‌రెడ్డి విజన్‌ ఉన్న నాయకుడు

  • వచ్చే నెలలో క్యాబినెట్‌ విస్తరణకు చాన్స్‌

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌/బర్కత్‌పుర, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పదేళ్ల విధ్వంస పాలనలో అస్తవ్యస్తంగా మారిన తెలంగాణను కాంగ్రెస్‌ సర్కారు సరిచేస్తూ వికాసం వైపు పరుగులు తీయిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని ఆనాడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. అధికారాన్ని కైవసం చేసుకున్న కేసీఆర్‌ నిర్బంధాలు, నిరంకుశ విధానాలతో దోపిడీకి తెరలేపారని విమర్శించారు. ప్రపంచంలో అతి స్వల్ప కాలంలో అత్యధికంగా ప్రజా సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర కేసీఆర్‌ కుటుంబానిదేనని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకొంటున్న సందర్భంగా మహేశ్‌గౌడ్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌తో నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌కు అప్పగిస్తే పదేళ్ల కాలంలో బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు.


తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్ర సంస్కృతికి దర్పణమైన తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం చేయవద్దని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌ ఉన్న నాయకుడన్నారు. పార్టీకి-ప్రభుత్వానికి మధ్య సమన్వయం తో నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వివరించారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో సామాజిక సమతుల్యత పాటించినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా లేదా జనవరి తొలి వారం లో మిగిలిన నామినేటెడ్‌ పోస్టులైన చైర్మన్‌లు, డైరెక్టర్‌ల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు, నాయకులను విస్మరించే ప్రసక్తే లేదన్నారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు. పార్టీలో కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టుగా విలేకరులు అడిగిన ప్రశ్నకు మహేశ్‌గౌడ్‌ సమాధానమిస్తూ.. ఇతర పార్టీలతో పోల్చితే కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువన్నారు.


  • బీఆర్‌ఎ్‌సలో మూడు ముక్కలాట

కుర్చీ కోసం బీఆర్‌ఎ్‌సలోని ముఖ్య నాయకులు మధ్య మూడు ముక్కలాట సాగుతోందని మహేశ్‌ గౌడ్‌ అన్నారు. కేటీఆర్‌ను దించేసి పదవి కోసం కవిత ప్రయత్నిస్తున్నారని.. వీరి ఇద్దరి మధ్య ఘర్షణ తనకు కలిసి వస్తుందనే ఆశతో హరీశ్‌రావు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇటు ప్రధాన ప్రతిపక్ష నేత గా కేసీఆర్‌ విఫలమై ఫాంహౌ్‌సకు పరిమితమయ్యారన్నారు.


  • బీజేపీలో నాలుగు స్తంభాలాట

బీజేపీ నేతలకు తెలంగాణపై మాట్లాడే నైతిక అర్హ త లేదని మహేశ్‌ గౌడ్‌ అన్నారు. తెలంగాణ కోసం నాడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే కిషన్‌రెడ్డి రాజీనామా చేయకుండా విదేశాలకు వెళ్లారన్నారు. ఇన్నే ళ్లుగా కేంద్రమంత్రిగా ఆయన తెలంగాణకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ పార్టీలో కుర్చీ కోసం నాలుగు స్తంభాలాట సాగుతోందని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌.. ఉత్తర-దక్షిణ ధృవాలని, ఈటల రాజేందర్‌, అరుణ.. తూర్పు-పడమరలుగా బీజేపీలో కొనసాగుతున్నారన్నారు.


  • మళ్లీ కాంగ్రె్‌సకే పట్టం..

తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ విజయం సాధించి అధికారం కొనసాగిస్తుందని మహేశ్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నేతలు చేసే చౌకబారు విమర్శలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. వచ్చే నెలలో క్యాబినెట్‌ విస్తరణకు అవకాశం ఉందని చెప్పారు. కాగా, కాంగ్రెస్‌ సర్కారు ఏడాది పాలనకు ‘పాలమూరు వీర పాట’ అద్దం పట్టిందని మహేశ్‌ గౌడ్‌ అన్నారు. ఈ పాటను అసెంబ్లీ ఆవరణలో ఆయన ఆవిష్కరించారు. ఈ పాటకు యుగంధర్‌గౌడ్‌ నిర్మాతగా వ్యవహరించగా.. గాయకుడు ఎంఎల్‌ఆర్‌ కార్తికేయ ఈ పాటను పాడారు.

Updated Date - Dec 08 , 2024 | 04:31 AM