Share News

Constables: పదోన్నతుల కోసం పడిగాపులు

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:30 AM

సర్వీసులో చేరి ఏళ్లు గడుస్తున్నా పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది.

Constables: పదోన్నతుల కోసం పడిగాపులు

  • హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లు

  • జిల్లాల నుంచి వచ్చిన జూనియర్లకు సెల్యూట్‌ చేయాల్సిన దుస్థితి

హైదరాబాద్‌, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): సర్వీసులో చేరి ఏళ్లు గడుస్తున్నా పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. వీరితో పాటు ఎంపికై వివిధ జిల్లాలు, ఇతర కమిషనరేట్లలో పనిచేస్తున్న సహాచరులు పదోన్నతులు పొంది పైస్థాయికి వెళ్లినప్పటికీ... వీళ్లకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. సాధారణంగా ఓ కానిస్టేబుల్‌ తన సర్వీసులో హెడ్‌ కానిస్టేబుల్‌, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్సై) స్థాయికి చేరుకోగలడు. ఇంకా సర్వీసు ఉంటే ఇన్‌స్పెక్టర్‌ హోదాలో రిటైరయ్యే అవకాశం ఉంటుంది.


అయితే పదోన్నతుల్లో ఇక్కడ చాలా ఆలస్యం జరుగుతుండటం వల్ల తాము ఆ అవకాశాన్ని కొల్పోతున్నామని పలువురు ఆవేదన చెందుతున్నారు. కొన్నిసార్లు కానిస్టేబుల్‌గా ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారు పదోన్నతులు పొంది హైదరాబాద్‌లో పోస్టింగ్‌కు వస్తే... తమ కంటే జూనియర్లు అయిన వారికి సెల్యూట్‌ చేయాల్సిన దుస్ధితి ఏర్పడిందని వాపోతున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న 1984, 1985, 1987 బ్యాచ్‌లకు చెందిన కానిస్టేబుళ్లలో చాలామంది ఇంకా ఏఎస్సైలుగానే కొనసాగుతున్నారు. అదే జిల్లాల్లో అయితే 1990 బ్యాచ్‌ వాళ్లు ఎస్సై కాగలిగారు. వాస్తవానికి అందరు కానిస్టేబుళ్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా రిటైర్‌ అవ్వాలనే కోరుకుంటారు. కానీ పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం వల్ల వారి ఆశలు అడియాసలవుతున్నాయి.

Updated Date - Nov 25 , 2024 | 02:30 AM