Cotton Procurement: పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం
ABN , Publish Date - Nov 12 , 2024 | 03:45 AM
కాటన్ కార్పొరేషన్ ఆప్ ఇండియా (సీసీఐ) నిబంధనల కారణంగా మిల్లర్లు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పత్తి కొనుగోళ్లను 4 గంటల పాటు నిలిపివేశారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్‌తో కిషన్‌రెడ్డి చర్చలు
సీసీఐ అధికారులతో తుమ్మల చర్చలు సఫలం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): కాటన్ కార్పొరేషన్ ఆప్ ఇండియా (సీసీఐ) నిబంధనల కారణంగా మిల్లర్లు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పత్తి కొనుగోళ్లను 4 గంటల పాటు నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని వివరించి, రైతులను ఆదుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గిరిరాజ్‌సింగ్, తెలంగాణలో పత్తి కొనుగోళ్లు జరపాలని సీసీఐని ఆదేశించారు. దీంతో పత్తి కొనుగోళ్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. పత్తి కొనుగోళ్లలో గత ఏడాది సీసీఐ అనుసరించిన నియమ నిబంధనలనే ఈ ఏడాదీ పాటించనుందని కిషన్‌రెడ్డి కార్యాలయం తెలిపింది. కనీస మద్దతు ధరకే సీసీఐ పత్తి కొనుగోళ్లు చేస్తుందని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.
సీసీఐ అధికారులతో తుమ్మల చర్చలు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సోమవారం హైదరాబాద్‌లో సీసీఐ సీఎండీ లలిత్ కుమార్, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ ఉదయ్‌కుమార్, తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డితో చర్చలు జరిపారు. పత్తి కొనుగోళ్లలో తలెత్తుతున్న ఎల్ 1, ఎల్2, ఎల్3తో పాటు తేమ విషయంలో వస్తున్న ఇబ్బందులు, నిబంధనల సడలింపుపై బొమ్మినేని రవీందర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. చర్చలు సఫలం కావడంతో మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లకు అనుమతించారు.
ముందస్తు సమాచార ం లేక ఇబ్బందులు
ఆదిలాబాద్ మార్కెట్‌తో పాటు నిర్మల్ జిల్లాలోని భైంసా, కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌లో కాటన్ వ్యాపారులు సీసీఐ, ప్రైవేట్ మిల్లులలో పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. కాటన్ మిల్లు యాజమానుల సమ్మెకు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచార ం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో వందలాది మంది రైతులు తమ పత్తి దిగుబడులను విక్రయించేందుకు తీసుకొచ్చారు. అయితే సీసీఐ కొనుగోలు కేంద్రాలతో పాటు ప్రైవేట్ మిల్లులలో సైతం కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ ఆయా చోట్ల పత్తి రైతులు ఆందోళన చేశారు. నిర్మల్ జిల్లాలోని భైంసా జాతీయ రహదారిపై బైఠాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకొని ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులకు సంఘీభావంగా పత్తి వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేసి నిరసన తెలిపారు. రెండు గంటల పాటు కొనుగోళ్లు స్తంభించాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. విషయం తెలియక మార్కెట్‌కు వచ్చిన రైతులు ఇబ్బందిపడ్డారు. పరిస్థితిని గమనించిన మార్కెట్ అధికారులు గ్రేడ్-2 వ్యాపారులతో పత్తి కొనిపించారు. సీసీఐ నిబంధనలను ఎత్తివేయాలని సోమవారం నాగర్‌కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని మర్రిపల్లి గ్రామ సమీపంలోని జడ్చర్ల-కోదాడ జాతీయ రాహదారిపై పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. 2 గంటల పాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లిలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. గుడిపల్లి మండలం నీలంనగర్ సమీపంలోని కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై పత్తి రైతులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి రోడ్డుపై పడుకుని ధర్నా నిర్వహించారు.