High Court: మోహన్‌బాబు కుటుంబ వివాదం వ్యక్తిగతం
ABN , Publish Date - Dec 12 , 2024 | 03:43 AM
సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ వివాదం వ్యక్తిగత అంశమని, ఆయన ఇంటి ప్రాంగణంలో జరిగిన ఘటనలతో శాంతిభద్రతలకు సంబంధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆయన ఇంట్లో గొడవ శాంతిభద్రతల పరిధిలోకి రాదు
సివిల్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం అనవసరం
బౌన్సర్లందరినీ పంపిచేయాలి
పోలీసుల షోకాజ్ నోటీసును కొట్టేయాలన్న మోహన్‌బాబు పిటిషన్‌పై హైకోర్టు
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ వివాదం వ్యక్తిగత అంశమని, ఆయన ఇంటి ప్రాంగణంలో జరిగిన ఘటనలతో శాంతిభద్రతలకు సంబంధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కుటుంబ వివాదాలు సివిల్ అంశాలు అయినందున ఇందులో పోలీసుల జోక్యం అనవసరమని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం తేల్చి చెప్పింది. జల్‌పల్లిలోని నివాసం వద్ద మంగళవారం జరిగిన ఘటనలపై మోహన్ బాబు వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్‌కు హాజరై వివరణ ఇవ్వాలని రాచకొండ కమిషనర్ జారీ చేసిన షోకాజ్ నోటీసును ఈ నెల 24వరకు వాయిదా వేసింది. పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసును కొట్టివేయాలని, తనకు రక్షణ కల్పించాలని మోహన్‌బాబు వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మోహన్‌బాబు, ఆయన కుమారుడు మనోజ్ బౌన్సర్లను వెంటపెట్టుకోవడం సరికాదని, వారందరినీ అక్కడ నుంచి పంపించివేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే, జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి ఒక కిలోమీటరు పరిధిలోకి సొంత కుటుంబసభ్యులు తప్ప వేరెవరూ వెళ్లరాదని పేర్కొంది. మనోజ్ వెంట కొందరు సంఘవ్యతిరేకులు, సోషల్ మీడియా, మీడియా ప్రతినిధులు వస్తున్నారని, తనకు పోలీసు రక్షణ కల్పించాలని మోహన్‌బాబు పిటిషన్‌లో అభ్యర్థించారు. మంగళవారం జరిగిన తోపులాటలో తనకు గాయాలయ్యాయని, ఆస్పత్రిలో చేరానని తెలిపారు. పోలీసుల షోకాజ్ నోటీసును రద్దు చేయాలన్నారు. అయితే, ఈ నెల 8న తమ మధ్య జరిగిన గొడవ వ్యక్తిగతమని తెలిపారు. కుటుంబ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోకుండా నిరోధించాలని, పోలీసులు మనోజ్‌కు మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు మోహన్‌బాబు ఇంటికి ఎప్పటిలాగే రెండు గంటలకొకసారి తనిఖీలకు వెళ్లాలని, ఇంటిపై నిఘా పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.
పోలీసులపై ఆరోపణలు సరికాదు
ఈ వ్యవహారంలో రాష్ట్ర హోంశాఖ తరఫు న్యాయవాది.. రాచకొండ కమిషనర్ ఎదుట బుధవారం మనోజ్ హాజరై వివరణ ఇచ్చారని, మోహన్‌బాబుకు జారీ చేసిన షోకాజ్ నోటీసును కొట్టేయాల్సిన అవసరం లేదని వాదించారు. పిటిషనర్ వచ్చి వివరణ ఇస్తే సమస్య ఏంటని, శాంతిభద్రతలను అదుపు చేయడానికి చట్టప్రకారం ఉన్న అధికారంతోనే కమిషనర్ నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదంతో పోలీసుల మీద ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే కేసు నమోదైనట్లు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. మోహన్‌బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నందున షోకాజ్ నోటీసును, తదుపరి విచారణను ఈ నెల 24వరకు వాయిదా వేసింది.