Current Bill Payments: మళ్లీ గూగుల్/ఫోన్‌పేలతో కరెంట్ బిల్లుల చెల్లింపు
ABN , Publish Date - Aug 17 , 2024 | 04:07 AM
కరెంట్ బిల్లులను మునపటిలాగే మళ్లీ గూగుల్‌పే/ఫోన్‌పే/అమెజాన్ పే/పేటీఎంల ద్వారా చెల్లించేందుకు మార్గం సుగమమైంది.
‘భారత్ బిల్ పే సర్వీస్’లో చేరిన డిస్కమ్‌లు
ప్రతి లావాదేవీకి రూ.2 రుసుముతో
డిస్కమ్‌లపై భారం.. నెలకు రూ.1.5కోట్లు
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కరెంట్ బిల్లులను మునపటిలాగే మళ్లీ గూగుల్‌పే/ఫోన్‌పే/అమెజాన్ పే/పేటీఎంల ద్వారా చెల్లించేందుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ఫలితంగా గత జూలై 1వ తేదీ నుంచి బిల్లుల చెల్లింపులు ఆయా థర్డ్ పార్టీ యాప్‌లలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు తాజాగా ‘భారత్ బిల్ పేమెంట్ సర్వీసు (బీబీపీఎ్‌స)’లో చేరిపోయాయి. దీంతో కరెంటు బిల్లుల చెల్లింపునకు యాప్‌లను వినియోగించుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
అయితే ప్రతీ లావాదేవీకి రూ.2తో పాటు (జీఎస్టీ అదనం)గా డిస్కమ్‌లు భారత జాతీయ చెల్లింపుల సంస్థ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎన్‌పీసీఐ)కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతీ నెల రూ.1.5 కోట్ల దాకా రెండు డిస్కమ్‌లపై అదనపు భారం పడనుంది. ఆర్‌బీఐ మార్గదర్శకాలు రానంతవరకు గూగుల్‌పే/ఫోన్‌పేలలో కరెంట్ బిల్లులు కడితే.. డిస్కమ్‌లు అదనంగా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు.. కాగా, థర్డ్ పార్టీ యాప్‌ల కంటే డిస్కమ్‌ల యాప్‌లే చెల్లింపులకు సురక్షితమని అధికారులు చెబుతున్నారు.
గూగుల్ ప్లేస్టోర్‌లో టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ యాప్‌లు లేదా https://tgsouthpower.org లేదా https://tgnpdcl.com లలోకి వెళ్లి.. బిల్లులు చెల్లించవచ్చని, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా నేరుగా అధికారులను సంప్రదించే అవకాశముంటుందంటున్నారు.