టీవీ రీచార్జ్ కోసం వెతికి.. నిండా మునిగి
ABN , Publish Date - Oct 30 , 2024 | 04:19 AM
కస్టమర్ కేర్ నంబరు కోసం గూగుల్‌లో వెతుకుతున్నారా? కొంచెం జాగ్రత్త! జాబితాలో కనిపించిన నంబరునల్లా క్లిక్ చేశారో హైదరాబాద్‌లోని ఓ వ్యాపారి (40)కి ఎదురైన చేదు అనుభవమే మీకూ ఎదురవ్వొచ్చు!
యాప్ డౌన్‌లోడ్ చేయించి 2.92 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కస్టమర్ కేర్ నంబరు కోసం గూగుల్‌లో వెతుకుతున్నారా? కొంచెం జాగ్రత్త! జాబితాలో కనిపించిన నంబరునల్లా క్లిక్ చేశారో హైదరాబాద్‌లోని ఓ వ్యాపారి (40)కి ఎదురైన చేదు అనుభవమే మీకూ ఎదురవ్వొచ్చు! సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన ఆ వ్యాపారి.. బ్యాంకు ఖాతాల వివరాలన్నీ చెప్పేసి రూ.2.92 లక్షలు సమర్పించుకున్నాడు. టీవీ రీచార్జ్ చేసేందుకు కస్టమర్ కేర్ నంబరు కోసం గూగుల్ సెర్చ్ చేసిన ఆ వ్యాపారి అందులో కనిపించిన నంబరుకు ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. కొద్దిసేపటికి కస్టమర్ కేర్ ప్రతినిధిని అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రీచార్జ్ చేయడానికి ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని సూచించి నంబర్ పంపాడు. దానికి ముందుగా రూ. 10 రీచార్జ్ చేయాలని సూచించాడు. సదరు నంబర్‌కు పేమెంట్ వెళ్లకపోవడంతో లింక్‌ను పంపాడు. ఈ లింక్ ద్వారా ’కస్టమర్ సపోర్ట్ యాప్‘ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, యాప్‌లో 3 బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకున్న తర్వాత చెల్లింపులు చేయాలని సూచించాడు. యాప్ డౌన్‌లోడ్ చేసిన 30 నిమిషాల్లో సైబర్ నేరగాళ్లు మూడు బ్యాంకు ఖాతాల నుంచి రూ.2.92 లక్షలు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు.
మోసపోయానని గుర్తించిన బాధితుడు ఘటనపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో.. ‘మీ సిమ్ కార్డ్ నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయని భయపెట్టిన సైబర్ కేటుగాళ్లు ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ.1.55 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఓ కేసు విషయమై ముంబై క్రైం బ్రాంచ్ అధికారులు మాట్లాడతారని చెప్పి కాల్ కనెక్ట్ చేశాడు.
మీ ఆధార్‌కార్డుకు లింక్ అయిన సిమ్ కార్డు నుంచి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగాయని భయపెట్టాడు. బాధితుడి నుంచి రూ.1.55 లక్షలు తాను సూచించిన ఖాతాలకు బదిలీ చేయించుకున్నాడు. అడిగినంత డబ్బులు చెల్లించినా, మళ్లీ డబ్బు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదైంది.