Trading Scam: ట్రేడింగ్ పేరుతో రూ.13.16 కోట్లు కొట్టేశారు
ABN , Publish Date - Sep 05 , 2024 | 04:51 AM
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో.. అధిక లాభాల ఆశ చూపి, ఓ సీనియర్ సిటీజన్ రూ.13.16 కోట్లు కొట్టేసిన ముగ్గురు సైబర్ కేటుగాళ్ల ఆటను సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు కట్టించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో.. అధిక లాభాల ఆశ చూపి, ఓ సీనియర్ సిటీజన్ రూ.13.16 కోట్లు కొట్టేసిన ముగ్గురు సైబర్ కేటుగాళ్ల ఆటను సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు కట్టించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సీనియర్ సిటీజన్‌కు కొద్దిరోజుల క్రితం రవి పవగీ పేరుతో వాట్సా్‌పలో ఓ సందేశం వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ కాల్స్ కోసం ఈ లింకు నొక్కి, గ్రూపులో చేరాలనేది అందులోని సారాంశం. దాంతో ఆయన ఆ గ్రూపులో చేరారు. అంతే.. ఆ వెంటనే అప్‌స్టాక్స్, ఇంటర్నేషనల్ బ్రోకింగ్(ఐబీ), ఏఎ్‌ఫఎ్‌సఎల్ కంపెనీల పేర్లతో పలువురు వ్యక్తులు బాధితుడిని ఫోన్‌లో సంప్రదించారు. పలు లింకులను పంపించారు.
వారి మాటలు నమ్మిన బాధితుడు.. ట్రేడింగ్‌లో కొంత మొత్తం పెట్టుబడి పెట్టారు. తొలుత బాగా లాభాలు వచ్చినట్లుగా కేటుగాళ్లు చూపించారు. ఆ తర్వాత కేటుగాళ్లు పలు దఫాలుగా అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించారు. అలా బాధితుడు విడతల వారీగా రూ.13.16 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. నిందితుల యాప్/వెబ్‌సైట్‌లో భారీగా లాభాలు వచ్చినట్లు చూపిస్తున్నా.. విత్‌డ్రాకు ఆప్షన్ ఇవ్వలేదు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఈ నెల 2న సీఎ్‌సబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ప్రాథమిక సాంకేతిక ఆధారాల మేరకు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఖాజా హాషిముద్దిన్, అరాఫ్ ఖాలేద్ మొహియుద్దీన్, మహమ్మద్ అతీర్‌పాషాను అరెస్టు చేశారు. వీరిలో సయ్యద్ ఖాజా విద్యార్థి అని పోలీసులు తెలిపారు.