Share News

Cyber Crime: కంబోడియాలో ఉద్యోగం పేరుతో సైబర్‌ నేరాల ఉచ్చులోకి

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:55 AM

ఉద్యోగం పేరుతో భారతీయులను కంబోడియాకు పంపించి.. వారితో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్న ముంబై ముఠా సభ్యురాలిని హైదరాబాద్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Cyber Crime: కంబోడియాలో ఉద్యోగం పేరుతో  సైబర్‌ నేరాల ఉచ్చులోకి

  • ముంబైకి చెందిన మహిళా ఏజెంట్‌ అరెస్ట్‌.. ఆమె వలకు చిక్కిన ఇద్దరు హైదరాబాదీలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగం పేరుతో భారతీయులను కంబోడియాకు పంపించి.. వారితో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్న ముంబై ముఠా సభ్యురాలిని హైదరాబాద్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె పేరు.. ప్రియాంక శివకుమార్‌ సిద్దు(30). ముంబైలోని చెంబూర్‌ ప్రాంతానికి చెందిన ప్రియాంక.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే లైసెన్స్‌డ్‌ సంస్థలో తొలుత పనిచేసేది. ఆ సంస్థ మూతపడటంతో ఆమె ఎలాంటి అనుమతులూ లేకుండా అలాంటి సంస్థనే ప్రారంభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేసి.. వారిని పర్యాటక వీసాలపై వేరే దేశాలకు పంపించేది. అక్కడికి వెళ్లాక ఆ వీసాలను ఉద్యోగ వీసాలుగా మార్చుకోవచ్చని నమ్మబలికేది.


ఈ క్రమంలో ఆమెకు ముంబైలోనే ఇదే తరహా మోసాలు చేసే నారాయణతో పరిచయమైంది. అతడు ఆమెను.. జితేందర్‌ షా అలియాస్‌ అమీర్‌ఖాన్‌ అనే వ్యక్తికి పరిచయం చేశాడు. అతడు కంబోడియాలో ఉంటూ.. చైనాకు చెందిన ఝాన్‌ జెయ్‌ అనే కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వేరే దేశాలకు చెందిన నిరుద్యోగులను అక్కడికి రప్పించి.. వారితో సైబర్‌ నేరాలు చేయించే కంపెనీ అది. ఈ విషయం నారాయణ ద్వారా తెలుసుకున్న ప్రియాంక స్వయంగా కంబోడియా వెళ్లి పరిశీలించింది. తమ సంస్థలో పనిచేసేందుకు యువకుల్ని పంపిస్తే ఒక్కో వ్యక్తికి 500 డాలర్లు కమీషన్‌ ఇస్తామని అతడు ప్రియాంకకు చెప్పాడు. డీల్‌ కుదుర్చుకుని ఇండియాకు వచ్చిన ఆమె.. తొలుత తన సోదరి కుమారుడైన అక్షయ్‌ వైద్య, అతడి స్నేహితుడు డాని్‌షఖాన్‌ను కంబోడియాకు పంపింది.


వాళ్లు అక్కడికి వెళ్లి సైబర్‌ నేరాలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత పేపర్లలో ప్రకటనలు, ఇతర ప్రచార మాధ్యమాల్లో కంబోడియాలో ఉద్యోగాల పేరుతో ప్రచారం చేసుకుని చాలామందిని అక్కడికి పంపింది. ఈ క్రమంలోనే.. ప్రియాంక ప్రచారాన్ని నమ్మి హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సంప్రదించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు చొప్పున వారి వద్ద కమీషన్‌ తీసుకున్న ప్రియాంక.. వారిద్దరినీ కంబోడియా పంపింది. సైబర్‌ నేరాలు చేయడానికి ఆ ఇద్దరూ ఒప్పుకోకపోవడంతో.. అక్కడివారు వారిని హింసించారు. ఎలాగోలా తప్పించుకుని భారతదేశానికి వచ్చేసిన ఇద్దరి ఫిర్యాదు మేరకు.. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి వెళ్లి ప్రియాంకను అరెస్ట్‌ చేశారు. విదేశీ ఉద్యోగాలనగానే ఆశపడి.. నకిలీ కన్సల్టెన్సీల మాటలు నమ్మి మోసపోవద్దని బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ ప్రజలకు సూచించారు.

Updated Date - Sep 14 , 2024 | 04:55 AM