Share News

Damodar Rajanarsimha: ‘ఆశా’ల సమస్యల పరిష్కారానికి సిద్ధం

ABN , Publish Date - Dec 12 , 2024 | 02:58 AM

ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం స్పష్టం చేశారు.

Damodar Rajanarsimha: ‘ఆశా’ల సమస్యల పరిష్కారానికి సిద్ధం

  • బీఆర్‌ఎస్‌ నేతలు ఆశా వర్కర్లకు మద్దతు పలకడం హాస్యాస్పదం

  • వైద్యారోగ్య మంత్రి రాజనర్సింహ

  • ఆశాల ఆకస్మిక ఆందోళన వెనుక విపక్షాల పాత్రపై సర్కారు ఆరా!

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల డిమాండ్ల సాధ్యాసాధ్యాలను అంచనా వేసి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈలోగా రాజకీయ నాయకుల వలలో పడవద్దని ఆశా వర్కర్లకు హితవు పలికారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్నా చౌక్‌ను మాయం చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు ఆశా వర్కర్లకు అండగా ఉంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆశా వర్కర్లకు మద్దతు పలుకుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయా సమస్యలను పరిష్కరించకుండా ఏం చేశారని ప్రశ్నించారు. ఆశా వర్కర్ల సమస్యలను నాడు పరిష్కరించి ఉంటే నేడు ఆశాలు రోడ్డెక్కాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అన్నారు.


ఆకస్మిక ఆందోళనల ఆంతర్యమేంటి ?

సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆశా వర్కర్లు ఆకస్మికంగా ఆందోళనకు దిగడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఆందోళనల వెనుక విపక్షాల పాత్రపై ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించి నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా పంపినట్టు సమాచారం. ఆశా వర్కర్ల ధర్నాల వెనుక ఆంతర్యాన్ని కనిపెట్టేందుకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఇతర రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు ఇన్సెంటీవ్‌ కింద ఎంత చెల్లిస్తున్నారనే లెక్కలు కూడా తీశారు. ఇన్సెంటీవ్‌ చెల్లింపులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నా ఆందోళన చేస్తుండడంతో ఏదో బలమైన కారణమే ఉందని సర్కారు భావిస్తుంది. మరోవైపు, ఆశ వర్కర్ల ప్రతినిధులు, సంఘాలతో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు త్వరలో చర్చలు జరిపే అవకాశం ఉంది.


గతంలోనే 105రోజుల పాటు ఆందోళన

ఆశా వర్కర్ల సమస్య ఇప్పటిది కాదు. గత పదేళ్లల్లో ఆశా వర్కర్లు అనేకసార్లు సమ్మెకు దిగారు. ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళనలు కూడా చేశారు. వేతన పెంపు ప్రధాన డిమాండ్‌గా ఇప్పుడు ఆందోళనలు నిర్వహిస్తున్నామని ఆశా వర్కర్లు చెబుతున్నారు. నిజానికి, తమకు రూ.18 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్లు 2015 సెప్టెంబరు 2 నుంచి 2015 డిసెంబరు 16 వరకు 106 రోజుల పాఉ సమ్మె చేశారు. సమ్మెకాలంలో పోలీసులు చాలా సార్లు ఆశాలపై దాడి చేశారు. అయినా, పట్టించుకోని అప్పటి బీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఆశాలను ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించింది. వందల మందికి నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో ఆశాల 2018లో బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన నాటి ప్రభుత్వం ఎన్నికల ముందే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారం చేపట్టినా హామీ అమలును పట్టించుకోకపోవడంతో ఆశాలు 2020 మార్చిలో మళ్లీ సమ్మె చేశారు. 2023 సెప్టెంబరులోనూ సమ్మెకు దిగారు. సరిగ్గా ఎన్నికల ముందు సమ్మె చేయడంతో నాటి పాలకులు తాము మళ్లీ అధికారంలోకి వస్తే రూ.18 వేలు ఫిక్స్‌డ్‌ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది.

ఆయా రాష్ట్రాల్లో ఆశాల

ఇన్సెంటీవ్‌లు ఇలా..

రాష్ట్రం ఇన్సెంటీవ్‌

(రూ.ల్లో)

ఏపీ 10,000

తెలంగాణ 9,900

బిహార్‌ 4,000

ఢిల్లీ 3,000

కేరళ 5,000

కర్ణాటక 4,000

యూపీ 3,750

బెంగాల్‌ 3,000

Updated Date - Dec 12 , 2024 | 02:58 AM