Nalgonda: వీల్‌చైర్‌లోని వృద్ధుడిని చెప్పుతో కొడుతూ..
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:18 AM
తన పేరిట ఉన్న భూమిని కొంతకాలంగా సాగుచేసుకుంటున్నా కౌలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకే మామపై కోడలు ఆగ్రహంతో ఊగిపోయింది!
దివ్యాంగుడైన మామపై కోడలి దాష్టీకం
సామాజిక మాధ్యమాల్లో వీడియోలో వైరల్
వేములపల్లి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తన పేరిట ఉన్న భూమిని కొంతకాలంగా సాగుచేసుకుంటున్నా కౌలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకే మామపై కోడలు ఆగ్రహంతో ఊగిపోయింది! ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాడని, పైగా దివ్యాంగుడని, ఇతరుల సాయం లేనిదే కదల్లేడనే విచక్షణ మరిచిపోయి దాడి చేసింది. ఆ వృద్ధుడు చేతులు అడ్డుపెడుతున్నా చెప్పుతో పదే పద్దే కొట్టింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఆ కోడలి దాష్టీకం తాలూకు వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే ఆ వృద్ధుడు పెంచుకుంటున్న శునకం, ఆ విశ్వా సంతోనే దాడి చేస్తున్న కోడలిని పదే పద్దే అడ్డుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగనపల్లి బుచ్చిరెడ్డి-అనసూర్య దంపతులకు ఇద్దరు కుమారులున్నారు.
పెద్ద కుమారుడు శ్రీ నివా్‌సరెడ్డికి, చిన్న కుమారుడు శేఖర్‌రెడ్డికి బుచ్చిరెడ్డి దంపతులు చెరో మూడెకరాలు రాసిచ్చారు. బుచ్చిరెడ్డి తన పేరిట 20 గుంటలు, భార్య పేరిట 3.1 ఎకరాలు ఉంచుకున్నాడు. ఈ భూమిని కూడా కొడుకులే సాగుచేసుకొని, ప్రతిగా కౌలు ఇవ్వాలనేది పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందం. అయితే ఏడాదిగా కౌలు ఇవ్వడం లేదంటూ పెద్ద కొడుకు శ్రీనివా్‌సరెడ్డి, కోడలు మణిమాలను గతనెల 20న బుచ్చిరెడ్డి ప్రశ్నించారు. మామపై మండిపడ్డ కోడలు, ఆయనపై చెప్పుతో దాడి చేసింది. ఈ ఘటనపై మర్నాడు బుచ్చిరెడ్డి వేములపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మణిమాలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మణిమాల స్పందించింది. భూమి విషయమై మామను తాను నిలదీశానని, అయితే ఆయన తనపై పరుష పదజాలం వాడడంతో కోపంతో చెప్పుతో కొట్టినట్లు వివరించింది.