Hyderabad: 111 మండలాల్లో లోటు వర్షపాతమే..
ABN , Publish Date - Jun 30 , 2024 | 05:10 AM
నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వచ్చి మురిపించినా.. రాష్ట్రంలోని 111 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జూన్ మొదటి వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటున 134 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
జూన్‌లో సగటున149 మి.మీ. నమోదు
కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితం
కొన్ని జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వచ్చి మురిపించినా.. రాష్ట్రంలోని 111 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జూన్ మొదటి వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటున 134 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రెండో వారంలో వర్షాలు తగ్గుముఖం పట్టగా... మూడో వారంలో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగటున 149 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో జూన్ నెల సగటు సాధారణ వర్షపాతం 119 మిల్లీమీటర్లు. అంటే సాధారణం కంటే జూన్‌లో సుమారు 20 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కానీ, వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని 7 మండలాల్లో కనీసం పంటలు వేసుకునేంత స్థాయిలోనూ వర్షాలు పడలేదు. అక్కడ తీవ్రలోటు వర్షపాతం (60-99శాతం) నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో 104 మండలాల్లో 20-59శాతం లోటు వర్షపాతం నమోదైంది. 210 మండలాల్లో సాధారణ వర్షపాతం కురవగా...166 మండలాల్లో అధికంగా, మరో 125 మండలాల్లో అత్యధిక వర్షపాతం రికార్డు అయింది. కాగా, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆది, సోమవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.