Cyber Crime: సైబర్‌క్రైమ్ కింగ్‌పిన్ కోసం.. ఢిల్లీ పోలీసుల వేట.. హైదరాబాద్‌లో అరెస్టు
ABN , Publish Date - Dec 10 , 2024 | 05:02 AM
చైనా చీటర్లతో చేతులు కలిపి.. మన వాళ్లను ఇండోనేషియా, లావోస్ వంటి దేశాల్లో బందీలుగా చేసుకుని.. కట్టుబానిసలుగా సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాకు చెందిన కింగ్‌పిన్ ఆటను ఢిల్లీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు కట్టించారు.
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): చైనా చీటర్లతో చేతులు కలిపి.. మన వాళ్లను ఇండోనేషియా, లావోస్ వంటి దేశాల్లో బందీలుగా చేసుకుని.. కట్టుబానిసలుగా సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాకు చెందిన కింగ్‌పిన్ ఆటను ఢిల్లీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు కట్టించారు. పోలీసుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ప్రశాక్ అనే వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో.. ఢిల్లీలో కమ్రాన్ హైదర్ నడిపే అలీ ఇంటర్నేషనల్ జాబ్ సర్వీసె్‌సను సంప్రదించాడు. అక్కడి సిబ్బంది థాయ్‌లాండ్ లేదా లావో్‌సలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. కొన్నాళ్లకు థాయ్‌లాండ్‌లో ఉద్యోగం వచ్చినట్లు చెప్పారు. దీంతో థాయ్‌లాండ్ వెళ్లిన ప్రకాశ్‌ను అక్కడ కలిసిన కమ్రాన్ మనుషులు వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి పాస్‌పోర్టు లాక్కొని, చైనాకు చెందిన చీటర్లకు అప్పగించారు. వారు ప్రకాశ్‌తో బలవంతంగా ఆన్‌లైన్‌లో సైబర్ నేరాలు చేయించారు.
వారి చెర నుంచి అతి కష్టమ్మీద బయటపడి భారత్‌కు చేరుకున్న ప్రకాశ్.. మే 27న న్యూఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐరోపా దేశాలు, అమెరికాకు చెందిన పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడడమే ఈ ముఠా విధించే టార్గెట్ అని పేర్కొన్నారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. మనుషుల అక్రమ రవాణా కోణంలో ఎన్‌ఐఏ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో.. చైనా చీటర్లతో ముంబైకి చెందిన సుదర్శన్ ధరాడేకు సంబంధాలున్నాయని, ఆయన తన లాంగ్‌షెంగ్ అనే కంపెనీ ద్వారా లావో్‌సలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే సుదర్శన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కమ్రాన్ హైదర్‌తోపాటు.. అతని ముఠాకు చెందిన మంజూర్ ఆలం, సాహిల్, ఆశిష్, పవన్ యాదవ్ కోసం ఢిల్లీ సైబర్‌క్రైమ్ పోలీసులు, ఎన్‌ఐఏ బృందాలు వేట ప్రారంభించాయి. అయితే.. కమ్రాన్ ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్లను, సిమ్‌కార్డులను మారుస్తూ తప్పించుకునేవాడు. చివరకు హైదరాబాద్ మీదుగా థాయ్‌లాండ్ పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు తెలుసుకుని ఆదివారం రాత్రి నాంపల్లిలో అరెస్టు చేశారు.