Share News

Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:03 AM

గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

  • ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్న అధికారులు

  • వాయిదా డిమాండ్‌ నేపథ్యంలో

  • నిరుద్యోగులతో చర్చించిన కాంగ్రెస్‌ నేతలు

  • గ్రూపు-2 పరీక్షలు వాయిదా?

  • మళ్లీ నవంబరు లేదా డిసెంబరులో?

  • ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్న అధికారులు

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5 వరకు జరుగుతాయి. 7, 8 తేదీల్లో గ్రూపు-2 పరీక్షలను నిర్వహించాలని షెడ్యూల్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూపు-2 పరీక్షలను నిర్వహించడం వల్ల నష్టపోతామని, వాటిని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పరీక్షలు వాయిదా వేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ పరీక్షలు వాయిదా పడితే.. మళ్లీ నవంబరు లేదా డిసెంబరులో నిర్వహించే అవకాశం ఉంది.


ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గ్రూపు-2 పరీక్షల వాయిదా అంశంపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్‌ తదితరులు గురువారం నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు గ్రూపు-1 ప్రిలిమనరీ పరీక్షలో 1:100 అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని, దీని ద్వారా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ చర్చల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.


‘వసతిగృహ సంక్షేమ అధికారి’ పోస్టుల ప్రిలిమనరీ కీ 22న

వసతి గృహ సంక్షేమ అధికారుల పోస్టుల భర్తీ కోసం జూన్‌లో నిర్వహించిన పరీక్షల ప్రిలిమనరీ కీని 22న విడుదల చేయాలని టీజీపీఎస్సీ అధికారులు నిర్ణయించారు. కీపై అభ్యంతరాలను 23 నుంచి 27వ తేదీలోపు తెలియజేయాలి. వాటిని పరిశీలించి, తుది కీని విడుదల చేయనున్నారు.

Updated Date - Jul 19 , 2024 | 04:03 AM