Share News

Lingampally: ఉద్యమాలకు నడకనేర్పిన మన కాలపు భగత్‌సింగ్‌ సాయిబాబా

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:49 AM

ప్రొఫెసర్‌ సాయిబాబా మరణానికి కేంద్రప్రభుత్వం బాధ్యత వహించాలని బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొ. సాయిబాబా సంస్మరణ సభలో వక్తలు డిమాండ్‌ చేశారు.

Lingampally: ఉద్యమాలకు నడకనేర్పిన మన కాలపు భగత్‌సింగ్‌ సాయిబాబా

  • సంస్మరణ సభలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌

  • సాయిబాబాది ముమ్మాటికి రాజ్యం హత్యేనని ఆరోపించిన వక్తలు

  • ఉపా చట్టాన్ని రద్దుచేయాలని మూకుమ్మడిగా డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్‌ సాయిబాబా మరణానికి కేంద్రప్రభుత్వం బాధ్యత వహించాలని బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొ. సాయిబాబా సంస్మరణ సభలో వక్తలు డిమాండ్‌ చేశారు. అన్యాయంగా పదేళ్లు అత్యంత కఠినమైన అండా సెల్‌లో నిర్బంధించడం వల్లే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, అదే సాయిబాబ మరణానికి కారణం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)ను రద్దు చేయాల్సిందిగా కార్యక్రమంలో పాల్గొన్నవారంతా నినదించారు. ప్రజాసంఘాలు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, విప్లవ ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉద్యమ సహచరులు, మేధావులు పాల్గొని సాయిబాబాకు నివాళులు అర్పించారు.


ప్రముఖ రచయిత్రి మీనా కందస్వామి మాట్లాడుతూ సాయిబాబాది ముమ్మాటికీ రాజ్యం హత్యే అని, అందులో మొదటి దోషి ఉపా చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం అయితే, దాన్ని ప్రశ్నించే గళాలను అణచివేసేందుకు దుర్వినియోగం చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం మరొక దోషి అని విమర్శించారు. ప్రముఖ మానవహక్కుల ఉద్యమనేత ప్రొ. హరగోపాల్‌ మాట్లాడుతూ... తాను నడవలేకపోయినా ప్రజా ఉద్యమాలకు నడక నేర్పిన మన కాలపు భగత్‌సింగ్‌ జీఎన్‌ సాయిబాబా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.


కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఉపా చట్టం పేరుతో అకారణంగా సాయిబాబాను పదేళ్లు నిర్బంధించి తర్వాత నిర్ధోషి అని విడుదల చేసి చేతులు దులుపుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. సీపీఐ(ఎం) తెలంగాణ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకు రాజీలేని పోరాటం సాగించిన సాయిబాబ నిబద్ధత, అంకితభావం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ సాయిబాబాను ప్రజాస్వామిక శక్తుల ప్రతీకగా అభివర్ణించారు.

Updated Date - Oct 22 , 2024 | 03:49 AM