Bhatti Vikramarka: ఒడిసాలో భట్టి విస్తృత ప్రచారం
ABN , Publish Date - May 18 , 2024 | 04:12 AM
ఒడిసాలో ఐదో దశ ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజక వర్గాల్లో డిప్యూటీ సీఎం భట్టి విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన ఒడిసాలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం అక్కడి నుంచి ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ప్రత్యేక విమానంలో ఒడిసాకు వెళ్లిన భట్టి.. బోలాంగిరి పరిధిలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు.
మూడ్రోజులుగా సభలు, సమావేశాలు
యూపీలో ర్యాలీని ప్రారంభించిన సీతక్క
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఒడిసాలో ఐదో దశ ఎన్నికలు జరిగే లోక్‌సభ నియోజక వర్గాల్లో డిప్యూటీ సీఎం భట్టి విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన ఒడిసాలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం అక్కడి నుంచి ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ప్రత్యేక విమానంలో ఒడిసాకు వెళ్లిన భట్టి.. బోలాంగిరి పరిధిలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. గురువారం భువనేశ్వర్‌కు చేరుకుని సోషల్ మీడియా నిర్వాహకులతో సమీక్షించారు. శుక్రవారం పుల్బనీలో జరిగిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి పాల్గొన్నారు. మరోవైపు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు.
మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచికుల్ల రాజేశ్‌రెడ్డి, మేఘారెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరిత రాయ్‌బరేలీకి తరలివెళ్లారు. అక్కడ ఇండియన్ యూత్ కాంగ్రెస్ బైకు ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరైన సీతక్క.. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాహుల్ ప్రధాని అయితే ప్రతీ మహిళకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తారన్నారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి విపత్తు నిధులు తేవాలని కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి సూచించారు. అప్పుడే తెలంగాణ ప్రజలు హర్షిస్తారన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ఓట్ల ఆరాటం తప్ప వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఏదైనా చేయాలన్న ఆలోచనే బీజేపీకి లేదని విమర్శించారు.