Hyderabad: ఫార్మా రాజధానిగా హైదరాబాద్..
ABN , Publish Date - Jul 06 , 2024 | 04:25 AM
‘‘హైదరాబాద్ అంటే బిర్యానీకి మాత్రమే కాదు.. బయో ఫార్మా పరిశ్రమకూ ప్రసిద్ధి చెందింది. బిర్యానీలో మసాలాలు ఎంత కీలకమో.. బయో ఫార్మా రంగంలో కొత్త ఆవిష్కరణలు అంతే కీలకం. పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందితే.. ఫార్మా రాజధానిగా హైదరాబాద్ ఖ్యాతి పొందింది.
ఇక్కడి నుంచే నాణ్యమైన జనరిక్ ఔషధాలు.. ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి తోడ్పాటు
వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల మేర ఎగుమతులు
ఫార్మాసిస్టుల పాత్ర భేష్: డిప్యూటీ సీఎం
ఫార్మా వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళిక
ఫార్మా జోన్లతో మరింత ఉపాధి: దుద్దిళ్ల
గ్రామీణాభివృద్ధికి సహకరించాలి: కోమటిరెడ్డి
హైటెక్స్‌లో ఐపీసీ ఎక్స్‌పో- 24 ప్రారంభం
హైదరాబాద్‌సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్ అంటే బిర్యానీకి మాత్రమే కాదు.. బయో ఫార్మా పరిశ్రమకూ ప్రసిద్ధి చెందింది. బిర్యానీలో మసాలాలు ఎంత కీలకమో.. బయో ఫార్మా రంగంలో కొత్త ఆవిష్కరణలు అంతే కీలకం. పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందితే.. ఫార్మా రాజధానిగా హైదరాబాద్ ఖ్యాతి పొందింది. ఆరోగ్య సంరక్షణ రంగానికి ఫార్మాసి్‌స్టలే వెన్నెముక. వారి నైపుణ్యంతో అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అందిస్తున్నారు. భారతీయ ఫార్మా పరిశ్రమ అంతర్జాతీయంగా గుర్తింపు పొందడంలో వారి సహకారం మరువలేనిది’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఎక్స్‌పో (ఐపీసీ ఎక్స్‌పో-2024)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్‌బీయింగ్’ నేపథ్యంతో 3 రోజుల పాటు సదస్సు జరగనుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ హైదరాబాద్‌లో అత్యంత నాణ్యమైన జనరిక్ ఔషధాలు తయారవుతున్నాయని గుర్తు చేశారు.
ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ఫార్మా పరిశ్రమ అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమన్నారు. ఇక్కడి శాస్త్రవేత్తలు, ఫార్మాసిస్టులు అవిశ్రాంతంగా కృషి చేయడం వల్లనే ఎన్నో వ్యాధులను దీటుగా ఎదుర్కోగలిగామన్నారు. దేశీయ అవసరాలతోపాటు అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకురావడం అభినందనీయమన్నారు. దేశంలోని ఫార్మా ఎగుమతుల్లో 35ు తెలంగాణ నుంచి ఉంటున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల ఎగుమతులు ఇక్కడ నుంచి జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి అవసరమైన ఔషధాలను ఇక్కడి పరిశ్రమలు తయారు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఫార్మా రంగానికి ఎల్లప్పుడూ ప్రభుత్వ తోడ్పాటు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో 9 నుంచి 10 ఫార్మా జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించనున్నామన్నారు. ఫార్మా పరిశ్రమకు అవసరమైన సదుపాయాలూ వీటిలో ఉంటాయన్నారు. ఫార్మా రంగంలో ఏఐ వినియోగంతో అద్భుతాలు సాధించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించామన్నారు. త్వరలోనే స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు కానుందని, ఐఎ్‌సబీ తరహాలో దీనిని నిర్వహించనున్నారన్నారు. అంతర్జాతీయ లైఫ్‌సైన్సెస్ రంగంలో ఎదిగేందుకు వీలుగా యువ తరాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
ఫార్మా యూనివర్శిటీ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతుందని, త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాది వేసింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్‌కు సమాంతరంగా 30వేల కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్ ప్రారంభించబోతున్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఇది మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిందిగా ఫార్మా పరిశ్రమను కోరుతున్నామన్నారు. ఐపీసీఏ అధ్యక్షుడు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సవాళ్లకు వినూత్న పరిష్కారాలను ఎక్స్‌పో అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో శాస్త్రీయ ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో 12ు వృద్ధి నమోదవుతుందని తెలిపారు. ఐపీసీఏ జనరల్ సెక్రటరీ టీవీ నారాయణ మాట్లాడుతూ కొవిడ్ సమయంలో 12లక్షల మందిపైగా ఫార్మసిస్టులు రాత్రి, పగలు పని చేశారని గుర్తు చేశారు. ఫార్మసీ రంగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫార్మా వర్శిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. అనంతరం ఫార్మా రంగానికి తోడ్పాటు అందించిన వారికి అవార్డులు అందజేశారు. ఫార్మా రంగంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ప్లేస్‌మెంట్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.
మూడు నాలుగు వారాల్లో నూతన పారిశ్రామిక విధానం
త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
ఎఫ్‌టీసీసీఐ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానం
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం మరో మూడు, నాలుగు వారాల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక విధానం ఉంటుందని తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఎక్స్‌లెన్స్ అవార్డు ప్రదానోత్సవానికి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 21 విభాగాల్లో ఎంపిక చేసిన ఉత్తమ పారిశ్రామికవేత్తలకు అవార్డులను ప్రధానం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలకు కావాల్సిన వసతులు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలకు అవసరమైన నిపుణులను అందించాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
పారిశ్రామిక రంగ నిపుణుల సహాయ సహకారాలతో వర్సిటీ విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు. వృత్తి నైపుణ్యం కలిగిన వారికి తెలంగాణను కేంద్రంగా చేస్తామని అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహకాలు, రాయితీల కింద బకాయి ఉన్న రూ.3700 కోట్ల చెల్లింపులపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ప్రకటించారు. గత తొమ్మిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అంతకముందు ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలాజయదేవ్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ పేరుతో భారీ మొత్తంలో పెంచిన ఫీజులను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డుల కమిటీ చైర్మన్ కరునేంధ్ర ఎస్.జాస్తి తదితరులు పాల్గొన్నారు.