Khammam: చనిపోయిన భార్య గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:34 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతిచెందడంతో ఆమెకు గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ తయారుచేయించి తన ప్రేమను చాటుకున్నడా భర్త.
పెనుబల్లి, ఆగస్టు 30: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనారోగ్యంతో మృతిచెందడంతో ఆమెకు గుర్తుగా హ్యాండ్ కాస్టింగ్ తయారుచేయించి తన ప్రేమను చాటుకున్నడా భర్త. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర గ్రామానికి చెందిన అశోక్ కన్నా.. 2006లో పద్మశ్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అశోక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో కలిసి సత్తుపల్లిలో స్థిరపడ్డాడు. వీరికి ఓ కుమార్తె ఉంది.
ఎంతో ఆనందంగా ఉన్న ఈ కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం అలుముకుంది. కొద్దిరోజుల క్రితం పద్మశ్రీ అనారోగ్యానికి గురైంది. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని.. తానే సర్వసంగా బతుకుతున్న అశోక్ ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
భార్య స్మృతులను శాశ్వతంగా నిలుపుకొనేందుకు అంత్యక్రియల రోజే భార్య చేయిని.. తన చేయిని, కుమార్తె చేయిని కలిపి విజయవాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ తయారుచేయించాడు. ఇప్పుడాయన దాన్ని తన గుర్తుగా పదిలపర్చుకున్నాడు.