Share News

DGP Jitender: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పటిష్ఠ భద్రత

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:53 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నట్లు వెల్లడించారు.

DGP Jitender: గ్రూప్‌-1 మెయిన్స్‌కు పటిష్ఠ భద్రత

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

  • ముత్యాలమ్మ గుడి ధ్వంసంపై సమగ్ర విచారణ

సుజాత తెలంగాణ పోలీసుల అదుపులో లేరు: డీజీపీ

హైదరాబాద్‌, చర్ల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముత్యాలమ్మ గుడి ధ్వంసం కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.


ఇది ఒక వ్యక్తి చేసిన దాడిగా ప్రాథమిక విచారణలో తేలిందని, దీని వెనక సంస్థల ప్రమేయం లేదన్నారు. మావోయిస్టు సుజాత తెలంగాణ పోలీసుల అదుపులో లేరని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవని, ఛత్తీ్‌సగఢ్‌ నుంచి తెలంగాణ వైపు వచ్చే ప్రయత్నం చేస్తే నిలువరిస్తున్నామని చెప్పారు.


  • సుజాతక్క అరెస్టు ప్రచారం బూటకం: మావోయిస్టు పార్టీ

మావోయిస్టు పార్టీ అగ్రనేత సుజాత క్షేమమేనని, ఆమె అరెస్టయినట్లు పాలకవర్గాలు చేస్తు న్న ప్రచారం నమ్మొద్దని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఈ మేరకు శనివారం దక్షిణ సబ్‌ జోనల్‌ బ్యూరో సమత పేరుతో లేఖను విడుదల చేసింది. పార్టీ నిర్మూలనకు కేంద్రం, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సమత ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ పేరు తో 2024లో జరిపిన దాడుల్లో 200పైగా మావోయిస్టులు చనిపోయారని, 2026 నాటికి మావోయిస్టులను నామరూపాల్లేకుండా చేస్తామని అమిత్‌షా ప్రకటించారని, అందులో భాగంగానే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వారిపై సామ, దాన, దండోపాయాలు ప్రయోగిస్తున్నారన్నారు. పార్టీ క్యాడర్‌లో భయం కల్గించేందుకే సుజాతక్కను అరెస్టు చేసినట్లు బూటకపు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.


  • రోడ్లకు పోలీసు అమరుల పేర్లు

పోలీసు అమరుల సేవలకు గుర్తింపుగా గ్రామీణ, పట్టణ రోడ్లకు వారి పేర్లు పెట్టాలని డీజీపీ జితేందర్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21 వరకు ఫ్లాగ్‌ డే నిర్వహిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ సహా సహా దేశవ్యాప్తంగా 240 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 03:54 AM