Share News

DGP Jitender: డ్రగ్స్‌ క్రయవిక్రయాలకు భయపడాల్సిందే!

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:45 AM

‘‘తెలంగాణలో డ్రగ్స్‌ అమ్మాలన్నా.. కొనాలన్నా భయపడేలా.. పట్టుబడితే శిక్ష తప్పదనేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్‌ రహితంగా.. మత్తుమందు దొరకని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం’’ అని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు.

DGP Jitender: డ్రగ్స్‌ క్రయవిక్రయాలకు భయపడాల్సిందే!

  • మత్తుమందు దొరకని రాష్ట్రంగా తెలంగాణ

  • 9.87ు పెరిగిన క్రైమ్‌.. రికవరీలు అద్భుతం

  • పక్కా వ్యూహంతో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట

  • సొత్తును వెనక్కు తేవడంలో రాష్ట్రం టాప్‌

  • ఫోన్‌ ట్యాప్‌ కేసులో ఇంటర్‌పోల్‌ సాయం

  • ‘సంధ్య థియేటర్‌’పై విచారణ సాగుతోంది

  • వార్షిక నివేదిక విడుదలలో డీజీపీ జితేందర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో డ్రగ్స్‌ అమ్మాలన్నా.. కొనాలన్నా భయపడేలా.. పట్టుబడితే శిక్ష తప్పదనేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్‌ రహితంగా.. మత్తుమందు దొరకని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం’’ అని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది మొత్తం 1,942 డ్రగ్స్‌ కేసుల్లో 4,682 మందిని అరెస్టు చేశామని, రూ.142.95 కోట్ల విలువైన మత్తుపదార్థాలను సీజ్‌ చేశామని గుర్తుచేశారు. ఈ కేసుల్లో నిందితులకు చెందిన రూ.55.8 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆదివారం ఆయన రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టుల కట్టడికి, సైబర్‌ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ‘‘సైబర్‌ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న వారికి రూ.180 కోట్ల మేర తిరిగి ఇప్పించాం. ఈ ఏడాది సైబర్‌ నేరాలకు సంబంధించి 25,184 ఫిర్యాదులు వచ్చాయి. గత ఏడాది(17,571 ఫిర్యాదులు)తో పోలిస్తే.. సైబర్‌ నేరాల్లో 25.18ు పెరుగుదల ఉంది. సైబర్‌ నేరాల్లో రికవరికీ సంబంధించి దేశంలోనే తెలంగాణ టాప్‌లో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద ఈ ఏడాది నేరాల్లో 9.87ు పెరుగుదల ఉందన్నారు. ‘‘గత ఏడాది మొత్తం 2,13,121 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది వాటి సంఖ్య 2,34,158గా ఉంది. వీటిల్లో 1,55,639 కేసులను నవంబరు నెలాఖరులోగా పరిష్కరించాం. ప్రాసిక్యూషన్‌, పోలీసు శాఖ కలిసి పనిచేయడం వల్ల చాలా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేయడం సాధ్యమైంది. వీటిల్లో మూడు మరణ శిక్షలు, 215 జీవిత ఖైదు శిక్షలున్నాయి. శిక్షలు పడ్డ వారిలో 35 మంది రౌడీషీటర్లున్నారు’’ అని వివరించారు.


మహిళలపై నేరాలు

మహిళలపై నేరాలు స్వల్పంగా పెరిగాయని డీజీపీ చెప్పారు. గత ఏడాది 19,013 కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది వాటి సంఖ్య 19,922కు పెరిగిందన్నారు. రాష్ట్రంలో మిస్సింగ్‌ కేసుల్లో 18ు మేర తగ్గుదల నమోదైందని వివరించారు. ‘‘రాష్ట్రంలో పనిచేస్తున్న 27 భరోసా కేంద్రాలు గృహహింస, వరకట్న వేధింపులు, అత్యాచారం కేసుల్లో బాధితులకు అండగా ఉంటున్నాయి. ఈ ఏడాది షీటీమ్స్‌కు 10,862 ఫిర్యాదులు రాగా.. వాటిపై 830 కేసులు నమోదు చేశాం. మిగతా వాటిల్లో 3,329 పెటీ కేసులు. ఇతర కేసులను కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించాం. భరోసా కేంద్రాలకు 2,964 ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 1,974 పోక్సో కేసులు కాగా.. 574 అత్యాచారాలు, 436 ఇతర వేధింపులకు సంబంధించిన కేసులున్నాయి’’ అని వెల్లడించారు. రేప్‌, పోక్సో కేసులకు సంబంఽధించి బాధితులకు ప్రభుత్వం రూ.5.42కోట్ల మేర నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు.


రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని జితేందర్‌ తెలిపారు. ‘‘గత ఏడాది 23,491 రోడ్డు ప్రమాద కేసులు నమోదవ్వగా.. ఈ వాటి సంఖ్య 20,702కు తగ్గాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు కూడా 1.49ు మేర తగ్గాయి. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 6,640మంది మరణించగా, ఈ ఏడాది 6,541మంది మరణాలు నమోదయ్యాయి. అత్యంత ఘోరమైన ప్రమాదాలు 2,336 నుంచి 1,018కి తగ్గాయి’’ అని వివరించారు. రోడ్డు ప్రమాదాల బ్లాక్‌స్పాట్లను ఎప్పటికప్పుడు గుర్తించి, ఇంజనీరింగ్‌ నిపుణులతో చర్చించి, తగు చర్యలు తీసుకోవడం ప్రమాదాల్లో తగ్గుదల సాధ్యమైందన్నారు. డీజీపీ వెల్లడించిన మరిన్ని ముఖ్యాంశాలు..

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇంటర్‌పోల్‌ సాయం తీసుకుంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. విదేశాల్లో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్‌లను రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

  • సంధ్య థియేటర్‌ ఘటనపై విచారణ కొనసాగుతోందని, కోర్టు పరిధిలోని అంశం కావడంతో దీనిపై మాట్లాడలేనని స్పష్టంచేశారు. బౌన్సర్లపై వచ్చిన ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, తేడా వస్తే వదిలేది లేదన్నారు.

  • మొట్ట మొదటి డిజిటల్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

  • కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ), తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీ-న్యాబ్‌)ను మరింత పటిష్ఠం చేస్తున్నాం.

  • ప్రొవిజన్‌ మరియు లాజిస్టిక్‌ విభాగం ద్వారా పాత వాహనాలు, తుక్కు సామగ్రి అమ్మకం ద్వారా రూ.9.49 కోట్లను ప్రభుత్వానికి డిపాజిట్‌ చేశామన్నారు.

  • రాష్ట్రంలో 53,651 సీసీ కెమెరాలు పోలీసు ఠాణాల్లో ఉన్నాయని.. 11,64,645 సీసీ కెమెరాలు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. సగం ఠాణాల్లో సీసీ కెమెరాలు లేవని ‘ఆంధ్రజ్యోతి’ అడిగి ప్రశ్నకు బదులిస్తూ.. దశల వారీగా అన్ని పోలీ్‌సస్టేషన్లలో వాటిని ఏర్పాటు చేస్తామన్నారు.

  • పని ఒత్తిడి, వివిధ కారణాలతో పోలీసు సిబ్బంది ఆత్మహత్యలు నమోదయ్యాయని, వీటిని నివారించేందుకు ప్రతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

  • ఎప్పటికప్పుడు పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్లు జరుపుతున్నామని.. ఈ ఏడాది 13 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు నియమితులయ్యారని డీజీపీ వివరించారు. వీరిలో 30ు మహిళలేనని తెలిపారు.

  • డయల్‌ 100, 112 సమర్థంగా పనిచేస్తున్నాయని, ఫిర్యాదు వచ్చిన 10 నిమిషాల్లో పోలీసులు సంఘటనాస్థలికి వెళ్తున్నారని వివరించారు.


పిల్లల రక్షణకు హ్యాండ్‌ బుక్‌

డిజిటల్‌ యుగంలో చిన్నారులు సైతం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను వాడుతున్నారు. ఇంటర్నెట్‌ను సర్ఫ్‌ చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) రూపొందించిన హ్యాండ్‌ బుక్‌ను డీజీపీ విడుదల చేశారు. స్మార్ట్‌ ఫోన్లను పిల్లలు ఎంత సేపు వాడవచ్చు? ఏయే యాప్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి? పేరంటల్‌ కంట్రోల్‌ ఎలా? తదితర అంశాలపై సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అందజేసిన సూచనలను హ్యాండ్‌ బుక్‌లో పొందుపరిచినట్లు డీజీపీ వివరించారు.


చలానాలు మా లక్ష్యం కాదు

ట్రాఫిక్‌ చలాన్ల ద్వారా రూ. 100 కోట్లు లేదా రూ.200 కోట్లను ప్రభుత్వానికి ఇవ్వడం తమ లక్ష్యం కాదని డీజీపీ స్పష్టం చేశారు. రహదారి భద్రత, ప్రయాణికుల ప్రాణాలను కాపాడడం తమ విధి అని వివరించారు. 2014కు ముందు 4ు మంది వాహనదారులే హెల్మెట్‌ ధరించేవారని, ఇప్పుడు వారి శాతం 80కి పెరిగిందన్నారు. రోజూ 3,500 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయని, వీటిల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 2 వేలకు పైగా ఉంటాయన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 04:45 AM