Share News

Hyderabad: రూ.500 కోట్ల సర్కారు భూమి స్వాహా

ABN , Publish Date - May 30 , 2024 | 05:53 AM

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి భూబాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ధరణిలోని లొసుగులను అడ్డుపెట్టుకుని నగర శివార్లలో నకిలీ పత్రాలతో దాదాపు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసిన వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అఽధికారులు, బడా నేతల ఆశీస్సులతో విలువైన ప్రభుత్వ భూములకు ఓ రాజకీయ నాయకుడి కుమారుడి పేరు మీద పట్టాదారు పాస్‌బుక్‌లు పొందారు.

Hyderabad: రూ.500 కోట్ల సర్కారు భూమి స్వాహా

  • నిషేధిత జాబితాలోని భూమికి నకిలీ డాక్యుమెంట్లు

  • గంధంగూడలో 9.36 ఎకరాల ప్రభుత్వ భూమికి

  • ధరణిని అడ్డుపెట్టుకుని పట్టాదారు పాస్‌బుక్‌లు

  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు చకచకా పావులు

  • రాజకీయ నేత కుమారుడి పేరిట భూ బదలాయింపు

  • ఇటీవలే అధికార పార్టీలో చేరిన ఆ నేత

  • విచారణ జరిపి పాస్‌బుక్‌లు రద్దుచేసిన కలెక్టర్‌

  • అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు.. భూమి స్వాధీనం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/నార్సింగ్‌)

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి భూబాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ధరణిలోని లొసుగులను అడ్డుపెట్టుకుని నగర శివార్లలో నకిలీ పత్రాలతో దాదాపు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసిన వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అఽధికారులు, బడా నేతల ఆశీస్సులతో విలువైన ప్రభుత్వ భూములకు ఓ రాజకీయ నాయకుడి కుమారుడి పేరు మీద పట్టాదారు పాస్‌బుక్‌లు పొందారు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారం ఇటీవల బయటకు పొక్కడంతో అధికారులు అన్ని ఽఆధారాలతో దీనిపై లోతుగా విచారించారు. అక్రమార్కులకు చెక్‌పెట్టి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పాస్‌బుక్‌లను రద్దు చేయడంతోపాటు నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నంబరు 51లో 9.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1958 నుంచి ఖాస్రా, ఇతర రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి సర్కారు కంచెగా నమోదైంది.


ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా ఎలాంటి లావాదేవీలు జరగకుండా దీనిని 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారు. ఇక్కడ ఎకరం భూమి విలువ కనీసం రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల పైనే ఉంటుంది. అత్యంత విలువైన ఈ భూమి ఖాళీగా ఉండడంతో కొందరు పెద్దల కన్ను పడింది. దీనిని ఎలాగైనా కాజేసేందుకు వారు వ్యూహం పన్నారు. గతంలో ఈ భూమిని జాగీర్‌దారులు.. మహ్మద్‌ నజీరుద్దీన్‌ (లేట్‌) అనే వ్యక్తికి బహుమతిగా ఇచ్చారంటూ ఆయన కుటుంబీకులు సబియా సుల్తానియా మరో 13 మంది తెరపైకి వచ్చారు. వీరంతా కలిసి వ్యూహాత్మకంగా నకిలీ పత్రాలతో రెవెన్యూ ట్రైబ్యునల్‌లో కేసు వేసి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. అప్పటి అధికార పార్టీ జియాగూడ మాజీ కార్పొరేటర్‌ ఎ.మిత్రకృష్ణ కుమారుడైన అభిషేక్‌కు ఈ భూమిని డాక్యుమెంట్‌ నంబరు 12698/2019 (తేదీ 18-11-2019) ద్వారా జీపీఏ చేశారు.


ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ పెద్దల ఆశీస్సులతో జీపీఏ రిజిస్టర్‌ పూర్తయింది. అనంతరం ధరణిలోని లొసుగులను అడ్డుపెట్టుకుని మిగతా తతంగమంతా నడిపారు. భూమి యజమానులుగా చెప్పుకొంటున్నవారు ఈ భూమికి పాస్‌బుక్‌ కోసం ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో జాగీర్‌ బహుమతిగా ఇచ్చిన ముంతాకాబ్‌ భూమి అని నమోదు చేశారు. ముంతాకాబ్‌ భూములకు సాధారణంగా సర్వే నంబర్లు ఉండవు. గంధంగూడ గ్రామం పేరు (ఆబాదీ) పేరుతోనే దరఖాస్తు చేశారు. తామంతా మహ్మద్‌ మజీరుద్దీన్‌ కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కూడా జతపరిచారు. ఈ ఆధారాలతో ఈ భూమికి 2023 మే 27న ధరణిలో ఖాతా నంబరు 5006 ఇచ్చారు. ఆబాదీ పేరుతోనే ఈ ఖాతా ఇవ్వడం గమనార్హం. తరువాత ఆబాదీ స్థానంలో అభిషేక్‌ పేరును మార్చి ఈ భూమికి మ్యుటేషన్‌ చేసి పట్టాదారు పాస్‌బుక్‌ (టీ05070160061) జారీ చేశారు. ఆ సమయంలో రికార్డులో ఉన్న సర్కారు భూమిని పట్టాభూమిగా మార్చేశారు. ఎన్నికల హడావిడి ప్రారంభం కావడంతో ఈ భూమిని వేరే వారికి విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.


పట్టించిన ఫ్యామిలీ సర్టిఫికెట్‌..

విలువైన సర్కారు భూమికి దొడ్డిదారిన పాస్‌బుక్‌లు పొందిన వ్యక్తి ఈ భూములను ఎన్నికల అనంతరం ఇతరులకు విక్రయించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే దీనిపై అప్పటికే ఫిర్యాదు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అభ్యంతరాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్‌ తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో రెవెన్యూ ట్రైబ్యునల్‌ నుంచి తమకు అనుకూలంగా వచ్చిన తీర్పునకు అనుగుణంగా పాస్‌బుక్‌లు జారీ చేయాల్సిందిగా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో హైకోర్టు.. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా అన్నివిధాలా విచారించి నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దీనిపై విచారించిన అధికారులు ఈ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు తీసుకురావాలని మహ్మద్‌ నజీరుద్దీన్‌ కుటుంబసభ్యులను ఆదేశించారు. వారు తీసుకువచ్చిన అన్ని పత్రాలను పరిశీలిస్తే మహ్మద్‌ మజీరుద్దీన్‌ కుటుంబ సభ్యులమంటూ తీసుకున్న సర్టిఫికెటే నకిలీదని తేలింది. ఫ్యామిలీ సర్టిఫికెట్‌ రిఫరెన్స్‌ నంబరు సీ/8864/2006 సర్టిఫికెట్‌ను 2006 ఏప్రిల్‌ 5వతేదీన రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ ఇచ్చినట్లు విచారాధికారులకు చూపించారు. అయితే ఈ పత్రం రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఇచ్చినట్లు ఎలాంటి ఆధారమూ దొరకలేదు. విచిత్రమేమిటంటే 2006 డిసెంబరు 31న ముగిసిన ఈ ఫైల్‌ చివరి నంబరు సీ/8426గా అధికారుల విచారణలో వెల్లడైంది. అంటే ఆ తరువాత ఎలాంటి సర్టిఫికెట్లు జారీ కాలేదు. కానీ సీ/8864 పేరుగా ఈ సర్టిఫికెట్‌ సృష్టించారు. ఇక్కడే వీరంతా దొరికిపోయారు.


పాస్‌బుక్‌లు రద్దు.. కేసులు నమోదు

మొత్తం వ్యవహారం బయటకు రాగానే జిల్లా కలెక్టర్‌ శశాంక.. గండిపేట తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డితో ప్రాథమిక విచారణ జరిపించారు. ఆ సర్వే నంబరులోని భూముల క్రయవిక్రయాలు జరగకుండా ముందుగా ప్రొసీడింగ్‌ డీ/624/2024 జారీ చేసి ధరణి పోర్టల్‌లో బ్లాక్‌ చేయించారు. అనంతరం అన్ని కోణాల్లో విచారించిన కలెక్టర్‌ ఈ భూములకు ఇచ్చిన పట్టాదార్‌ పాస్‌బుక్‌లను రద్దు చేశారు. అలాగే నకిలీ పత్రాలు సృష్టించిన 14 మందిపై నార్సింగ్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయించి క్రిమినల్‌ కేసు (ఎఫ్‌ఐఆర్‌ 489/2024) నమోదు చేశారు. భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి బుధవారం ఉదయం పోలీసుల సహకారంతో ఈ ప్రాంతానికి వచ్చి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అందులో వేసిన తాత్కాలిక షెడ్లను తొలగించి.. అక్కడ ఉన్నవారిని పంపించి వేశారు.


పార్టీ మారినా..

గంధంగూడ భూమిని తన పేరిట చేయించుకున్న అభిషేక్‌ తండ్రి, జియాగూడ మాజీ కార్పొరేటర్‌ మిత్ర కృష్ణ ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కృష్ణ గత ఎన్నికల్లో కార్వాన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గత ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా మెలగిన కృష్ణ.. అకస్మాత్తుగా కాంగ్రె్‌సలో చేరడానికి కారణం గంధంగూడ భూమి వ్యవహారమేనని తెలిసింది. అయినప్పటికీ.. ఈ భూమి విషయంలో చట్టం తనపని తాను చేసుకు పోయింది. కాగా, ఈ భూ కుంభకోణం వెనుక గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన బడా నేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఆదేశాలతోనే అధికారులు పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు చెప్పుకొంటున్నారు.

Updated Date - May 30 , 2024 | 05:53 AM