Kishan Reddy: గోవా రైలుకు పచ్చజెండా
ABN , Publish Date - Oct 07 , 2024 | 04:29 AM
సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు సర్వీసు అందుబాటులోకి రావడం తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
సికింద్రాబాద్ నుంచి ప్రారంభించిన.. కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్/హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు సర్వీసు అందుబాటులోకి రావడం తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వాస్కో డ గామా బై వీక్లీ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు సర్వీసు లేదన్నారు. గతంలో గోవాకు వెళ్లాలంటే పలు స్టేషన్లలో రైళ్లు మారాల్సి వచ్చేదని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవా వెళ్లే కొత్త రైలు కర్ణాటక వాసులకూ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయని వెల్లడించారు. చర్లపల్లి స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లనూ ఆధునీకరిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
మెట్రో కారిడార్ 4, 9ను మార్చాలని బీజేపీ నేతల వినతి
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు సంబంధించిన కారిడార్ 4, 9లో మార్పులు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. తాము ప్రతిపాదించిన రూట్‌లో ఈ కారిడార్లు ఏర్పాటు చేస్తే 35 కి.మీ. మేర దూరం తగ్గుతుందని, తద్వారా ప్రాజక్టు ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ‘‘మెట్రో అధికారులు విడుదల చేసిన రూట్‌మ్యాప్ ప్రకారం కారిడార్ 4 నాగోల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు 36 కి.మీ. ఉంటుంది. కారిడార్ 9శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు 40కి.మీ. ఉంటుంది.
అంటే మొత్తం 76కి.మీ. మెట్రో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని బదులు నాగోల్-ఎల్బీనగర్-మందమల్లమ్మ-బాలాపూర్ చౌరస్తా-శివాజీ చౌక్-ఆర్‌సీఐ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్-మహేశ్వరం గేట్-కందుకూరు ఫోర్త్ సిటీ వరకు మెట్రో లైను ఏర్పాటు చేస్తే 41 కి.మీ.తో పూర్తి చేయవచ్చు’’ అని శ్రీరాములు యాదవ్ వివరించారు. ఈ రూట్‌మ్యా్‌పను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని.. ఆయన సూచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మెట్రో ఎండీకి అందజేస్తామని శ్రీరాములు యాదవ్ పేర్కొన్నారు. కాగా, బంజారాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ సీతారాంనాయక్ డిమాండ్ చేశారు.