Share News

Banjara Hills: బస్తీలో వాట్సాప్‌ లొల్లి..

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:04 AM

బస్తీలో సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూప్‌.. రాజకీయ పార్టీల మద్య విబేధాలకు, గొడవలకు కారణమవుతోంది.

Banjara Hills: బస్తీలో వాట్సాప్‌ లొల్లి..

  • సమస్యలపై వాట్సాప్‌ గ్రూపులో బీజేపీ నాయకురాలి విమర్శలు

  • ఆమెపై మేయర్‌ విజయలక్ష్మి మనుషులు దాడి చేసినట్టు ఆరోపణ

  • నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం.. పోలీసులకు ఫిర్యాదు

  • మేయర్‌ మనుషులు బెదిరిస్తున్నారంటూ ఠాణాకు గ్రూపు సభ్యులు

బంజారాహిల్స్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): బస్తీలో సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూప్‌.. రాజకీయ పార్టీల మద్య విబేధాలకు, గొడవలకు కారణమవుతోంది. మాటా మాటా పెరిగి చివరకు ఆత్మహత్యాయత్నం దాకా వెళ్లి.. ఆ పంచాయితీ పోలీసుస్టేషన్‌కు చేరింది. నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్‌ డివిజన్‌లో ఎన్‌బీటీ నగర్‌ బస్తీ ఉంది. మేయర్‌ నివాసం అక్కడే ఉంది. ఇటీవలికాలంలో బస్తీకి చెందిన సుమారు 800 మంది ఇంటి యజమానులు, అధికారులు ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నారు. అందులో పలు సమస్యల గురించి బస్తీవాసులు గ్రూప్‌లో పోస్టు చేస్తుంటే.. అధికారులు సమాధానం చెబుతున్నారు.


నాలుగు రోజుల క్రితం.. బస్తీ సమస్యలను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ బీజేపీకి చెందిన పావని అనే నాయకురాలు గ్రూప్‌లో విమర్శలుచేశారు. బస్తీని ఇలాగే వదిలేస్తే మరో బంగ్లాదేశ్‌గా మారుతుందంటూ పోస్టు పెట్టారు. ఆమె అలా విమర్శించడం సరైన పద్ధతి కాదని గ్రూప్‌ సభ్యులు అభిప్రాయపడ్డారు. అలా అనడం తప్పని పావని అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. కానీ గురువారం పావని ఇంట్లో ఉండగా మేయర్‌కు చెందిన మనుషులు ఆమె నివాసానికి వెళ్లి వాగ్వాదానికి దిగారని.. ఆమెను కొట్టి రోడ్డు మీదకు తీసుకువచ్చి దుర్భాషలాడారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనస్తాపానికి గురైన పావని నిద్రమాత్రలు మిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం మహావీర్‌ ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆమె.. మేయర్‌ మనుషులపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


  • గ్రూప్‌ సభ్యుల ఫిర్యాదు..

బస్తీ సమస్యలపై గ్రూప్‌లో చర్చిస్తుండడంపై కక్ష పెట్టుకుని.. మేయర్‌ మనుషులు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రూప్‌కు చెందిన 27 మంది సభ్యులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్తీలో ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న ఖాళీ మైదానంలో కొంత మంది అక్రమంగా పార్కింగ్‌ చేసుకొని గంజాయిలాంటి మత్తు పదార్థాలు వినియోగిస్తుండటంతో బస్తీ వాసులంతా కలిసి అక్కడ ‘నో పార్కింగ్‌’ బోర్డు ఏర్పాటు చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు.


గురువారం అక్కడ జెండా ఎగురవేసేందుకు వచ్చిన మేయర్‌, అమె మనుషులు.. ఆ బోర్డును కాలితో తన్ని బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్నారు. సమస్యలపై నిలదీసినందుకు.. మేయర్‌ కూడా బెదిరింపు దోరణిలో వాట్సా్‌పలో మెసెజ్‌లు పెడుతున్నారని ఆరోపించారు. కాగా.. బస్తీ సమస్యలపై తాను వాట్సాప్‌ గ్రూప్‌లో నిలదీసినందుకు మేయర్‌ తన ఇంటిని పడగొట్టిస్తానంటూ బెదిరించారని బీఆర్‌ఎస్‌ నాయకుడు రాజు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Updated Date - Aug 16 , 2024 | 03:04 AM